UNION BUDGET 2022 INDIAN RAILWAYS MAY GET HUGE ALLOCATIONS AS MINISTRY OF RAILWAYS SENT PROPOSALS SS GH
Union Budget 2022: బడ్జెట్లో రైల్వేలకు భారీ కేటాయింపులు...ప్రతిపాదనలు పంపిన రైల్వే శాఖ
Union Budget 2022: బడ్జెట్లో రైల్వేలకు భారీ కేటాయింపులు...ప్రతిపాదనలు పంపిన రైల్వే శాఖ
(ప్రతీకాత్మక చిత్రం)
Union Budget 2022 | ఫ్రైట్ కారిడర్, స్పీడ్ రైల్స్ సహ ప్రస్తుతమున్న వాహనాలను ఆధునికరించడం, కొత్త తరహా రైళ్లు, వ్యాగన్లు, లోకోల వంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పన కోసం మూలధన వ్యయం పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
రైల్వేలను పట్టాలపై మరింత జోరుగా పరుగులు తీయించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రైల్వే శాఖకు భారీ బడ్జెట్ (Union Budget 2022) కేటాయింపులు ఉండనున్నాయని సమాచారం. జాతీయ రవాణా వ్యవస్థ అయిన రైల్వేలను సమూలంగా మార్చేందుకు అవసరమైన చేయూతను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2022-23 బడ్జెట్లో భారతీయ రైల్వేల (Indian Railways) ప్రణాళిక పరిమాణం 2022 బడ్జెట్తో పోలిస్తే 20% మేర పెరిగే సూచనలున్నాయి. రానున్న బడ్జెట్లో కేటాయింపులు రూ. 2.5 ట్రిలియన్లు ఉండవచ్చని అంచనా.
రైలు ప్రయాణాన్ని సురక్షితంగా, సాఫీగా సాగేలా చేసేందుకు మొత్తం అన్ని మార్గాల ఎలక్ట్రిఫికేషన్, సిగ్నల్ ఓవర్ హలింగ్ పనులు చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతున్న ఈ తరుణంలో క్యాపెక్స్ కేటాయింపులు భారీగా ఉండాల్సిన అవసరం రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతేడాది బడ్జెట్లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరిపింది. 2022-23 బడ్జెట్ ఆ మొత్తం కంటే ఎక్కువ కేటాయింపులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
గతేడాది రూ.2.15 ట్రిలియన్లు కేటాయింపు జరిగింది. రైల్వే శాఖకు ఇంత భారీ మొత్తం కేటాయించడం అదే ప్రథమం. ఇందులో రూ.7,500 కోట్లు అంతర్గత వనరుల ద్వారా, రూ.1 ట్రిలియన్ అదనపు బడ్జెట్ వనరుల ద్వారా, మరో రూ.1.07 ట్రిలియన్లను స్థూల బడ్జెట్ సపోర్టు కింద అందాయి. స్థూల బడ్జెట్ సపోర్టు అన్నది ప్రభుత్వ సాధారణ బడ్జెట్ నుంచి భారతీయ రైల్వేలు అందుకునే మొత్తం. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 21లో రూ.70,250 కోట్లు, ఆర్థిక సంవత్సరం 2020లో రూ. 69,967 కోట్లు, ఆర్థిక సంవత్సరం 2019లో రూ.55,088 కోట్లు మాత్రమే రైల్వే శాఖకు ప్రభుత్వం నుంచి స్థూల బడ్జెట్ సపోర్టు కింద లభించాయి.
గత సంవత్సరం కేటాయించిన స్థూల బడ్జెట్ సపోర్టు నుంచి 90 శాతానికి పైగా మూలధన వ్యయం కిందకు వెళ్లింది. ఇంతకు ముందు దశాబ్దాల పాటు ప్రభుత్వం నుంచి రెవెన్యూ వ్యయ చేయూత మాత్రమే రైల్వే శాఖకు అందేది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మూలధన వ్యయంపై దృష్టి సారిస్తూ స్థూల బడ్జెట్ చేయూత అందిస్తోంది. ఈ సంవత్సరం అందించే బడ్జెట్ సపోర్టులో పెద్ద మొత్తం అహ్మదాబాద్-ముంబయి ప్రాజెక్టుకు వెళ్లనుంది. ప్రతిపాదిత ఢిల్లీ-వారణాసి మార్గంలో పనులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
రైల్వేల ఖర్చులో 75% వేతనాలకే పోతుంది. సమర్థతగా కొలమానంగా భావించే నిర్వహణ నిష్పత్తి రైల్వే 96%గా ఉంది. అంటే రైల్వే శాఖ రూ.100 సంపాదిస్తే అందులో రూ.96 ఖర్చు చేస్తుంది. ఇకపై రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకొని మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ వైపు మళ్లాలని రైల్వే శాఖ భావిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.