Coronavirus cess: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు టైమ్ దగ్గర పడుతోంది. 2021-2022 బడ్జెట్ ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ట్యాక్స్ చెల్లించేవారిపై ఈ సంవత్సరం కొత్తగా కరోనా వైరస్ సెస్ లేదా సర్ఛార్జీని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2021-22 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గత సంవత్సరం కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. వృద్ధి రేటు భారీగా పడిపోయింది. రెవిన్యూ లోటు పెరిగింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ పడుతున్నారు. కేంద్రం దశల వారీగా ప్యాకేజీలు ప్రకటించింది. ఈ బడ్జెట్లో ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కె.అగర్వాల్ అండ్ కో సంస్థ ప్రతినిధి, CA ఆదిత్య ఎమ్ అగర్వాల్ తెలిపారు.
కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. మరోవైపు మహమ్మారి వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ట్యాక్స్ చెల్లింపుదారులను, MSMEలను ఆదుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతోపాటు ఇప్పటికే మొదటి దశ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ఇమ్యునైజేషన్ ఖర్చులు, కోవిడ్ సమయంలో ప్రకటించిన ఉపశమన చర్యలకు అయిన ఖర్చులన్నీ కలిపి ఖజానాపై భారీ ప్రభావం చూపుతున్నాయి. ఈ భారీ రెవిన్యూ లోటు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని అగర్వాల్ తెలిపారు. వీటన్నింటి బట్టి చూస్తే, ఈ బడ్జెట్లో COVID-19 సెస్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై, నిర్ధిష్ట టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఈ సెస్ విధించవచ్చని తెలుస్తోంది.
* సెస్ అంటే ఏంటి?
ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ప్రభుత్వాలు సెస్‌ను విధిస్తాయి. ఇలా వచ్చే ఆదాయాన్ని సంబంధిత కార్యక్రమాల కోసం కేటాయిస్తారు. ఆ నిర్ణీత పథకం లక్ష్యాలు నెరవేరిన తరువాత దీన్ని రద్దు చేస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం, సెస్ విధించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఒక నిర్ధిష్ట ప్రయోజనం కోసం మాత్రమే దీన్ని విధించాలి. ఇప్పటికే అమల్లో ఉన్న ట్యాక్స్ పాలసీలతో సంబంధం లేకుండా, అదనంగా చెల్లించాల్సిన ట్యాక్స్ కిందకు సెస్ వస్తుంది. ఈ సెస్‌ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధిస్తుంది. ఈ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోదు. ఈ బడ్జెట్లో కొత్తగా ట్యాక్స్‌ను పెంచాల్సిన అవసరం లేకుండా రెవిన్యూ లోటును పూడ్చుకునేందుకు సెస్‌ను ప్రభుత్వం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Pearl Astrology: ముత్యాలు, వెండి నగలు ధరిస్తున్నారా... ఈ 8 నష్టాలు తప్పవు
* కరోనా ఖర్చుల దృష్ట్యా సెస్:
కరోనా వ్యాక్సినేషన్, COVID-19 కిట్లు, ఆరోగ్య పరీక్షలు వంటి మెడికల్ ప్రోగ్రాంలకు అవుతున్న ఖర్చును భరించేందుకు కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో సెస్‌ను ప్రవేశపెట్టవచ్చని AMK గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ట్యాక్స్ పార్టనర్, అమిత్ మహేశ్వరి తెలిపారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. దీన్ని కరోనా వైరస్ సెస్ ద్వారా సమీకరించుకోవచ్చు. ఒకటి, రెండేళ్లలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత కోవిడ్ సెస్‌ను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.