Union Budget 2021: ఈ సారి కేంద్ర బడ్జెట్ స్పెషాలిటీ ఇదే..ఏమిటంటే...

నిర్మల సీతారామన్ (Image;ANI)

భారతదేశ చరిత్రలో తొలిసారి పేపర్లెస్ బడ్జెట్ ను (paperless budget) ప్రెజెంట్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో బడ్జెట్ ఎలా ఉండబోతోందనే అంశాలతో పాటు బడ్జెట్ ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.

  • Share this:
స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర బడ్జెట్ కాగితంపై ముద్రించకుండా పేపర్లెస్ మోడ్ లో ప్రెజంట్ చేయబోతోంది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్ పత్రాలను.. కోవిడ్-19 మహమ్మారి (covid-19 pandemic) కారణంగా అస్సలు ముద్రించకూడదని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఇది ఓ చారిత్రక నిర్ణయంగా మారింది. దీంతో యూనియన్ బడ్జెట్ 2021 the budget సాఫ్ట్ కాపీలు మాత్రమే ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు అందనున్నాయి. ఈమేరకు ఇప్పటికే లోక్ సభ, రాజ్యసభల అనుమతిని కూడా కేంద్ర ఆర్థికశాఖ తీసుకున్నట్టు అధికారికంగా ధ్రువీకరించారు. సుమారు 15 రోజులపాటు రేయింబవళ్లు ప్రింటింగ్ డివిజన్లో ఎంతోమంది అధికారులు, ఉద్యోగులు కలిసి ఒకేచోట పనిచేయటం ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో, వీరందరి ఆరోగ్యానికి మంచిది కాదనే కారణంతో ముద్రణా కార్యక్రమాలు అసలు చేపట్టకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవటం విశేషం. నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలోని సొంత ప్రింటింగ్ ప్రెస్ లో ప్రతి ఏటా ఈ బడ్జెట్ పత్రాలను ముద్రిస్తారు.

హల్వా ఫెస్టివల్ లేనట్టే

ముందుగా హల్వా ఫెస్టివల్ (Halwa festival) నిర్వహించి ఆతరువాత రేయింబవళ్లు ప్రింటింగ్ పనులను పూర్తిచేస్తారు. సాధారణంగా ఈ ఫెస్టివల్ ను జనవరి 20న నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆర్థిక శాఖలోని ఉద్యోగులంతా ఆఫీసులోనే ఉండాల్సి వస్తుంది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాకనే వీరంతా ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. అత్యంత రహస్యంగా, ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ఇదంతా జరుగుతుంది. అయితే ఢిల్లీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో..ఈసారి ఈమేరకు మార్పులు చేపట్టారు. అయితే ఈసారి హల్వా ఫెస్టివల్ ను కూడా కరోనా కారణంగా ఏర్పాటు చేయటం లేదు. బడ్జెట్ తయారీలో తలమునలకలయ్యే వ్యక్తులు, శాఖలు అన్నీ హల్వా ఫెస్టివల్ లో పాల్గొంటారు. హల్వా ఫెస్టివల్ అంటే ఇక బడ్జెట్ కాపీలు ముద్రించటం మొదలుపెట్టే ముహూర్తమని అర్థం. హైర్యాంక్ లో ఉన్న ఉన్నతాధికారులకు స్పెషల్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి బడ్జెట్ ముద్రించే ప్రాంతంలోకి అనుమతిస్తారు. ఇక బడ్జెట్ కాపీల ముద్రణ, ప్యాకింగ్, రవాణా వంటివన్నీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కనుసన్నల్లో అత్యంత రహస్యంగా, జాగ్రత్తగా సాగే తంతు.

కొత్త సంప్రదాయాలు..

మొట్టమొదటి సారి ఈ సంప్రదాయాలకు విరామం ఇస్తూ కేంద్ర బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నారు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). వలసవాదానికి చిహ్నమైన బడ్జెట్ సూట్ కేస్ కు బదులు గతేడాది హ్యాండ్ మేడ్ ఎర్రటి క్లాత్ బ్యాగ్ లో బడ్జెట్ పత్రాలను తెచ్చిన నిర్మలా సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఈసారి యూనియన్ బడ్జెట్ 2021Union budget 2021 ను పాత సంప్రదాయల ప్రకారం కాకుండా పూర్తిగా సరికొత్త సంప్రదాయాలతో తయారు చేస్తున్నారన్నమాట. రైల్వే బడ్జెట్‌ విలీనం చేయటం, బడ్జెట్‌ తేదీని ముందుకు జరపడం వంటివి మోడీ ప్రభుత్వం తెచ్చిన సరికొత్త సంప్రదాయాలుగా మారాయి.

గో గ్రీన్..

‘‘గో గ్రీన్‌’’ (go green) కార్యక్రమంలో భాగంగా ఇబ్బడి ముబ్బడిగా బడ్జెట్‌ పత్రాలను ముద్రించకుండా పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించి అమలు చేస్తోంది. కేవలం ఎంపీలకు సరిపడా పత్రాలు మాత్రమే ముద్రించి, మీడియా, ప్రజలకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీంతో గతంలో రాజ్యసభ, లోక్‌సభలో ఉన్న 788 మంది ఎంపీలకే ముద్రించిన పత్రాలు అందజేశారు. ఎకనామిక్‌ సర్వే పుస్తకాన్ని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. రెండేళ్లుగా బడ్జెట్‌ పత్రాల ముద్రణను పూర్తిగా తగ్గిస్తూ వచ్చారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో కాపీని ముద్రించడానికి 3,450 రూపాయలు ఖర్చవుతుంది. ప్రస్తుతం పేపర్‌లెస్ తో ప్రభుత్వ ఖజానాకు కోటికి పైగా రూపాయలు ఆదా అవుతాయని అంచనా.
Published by:Krishna Adithya
First published: