కేంద్ర బడ్జెట్‌ను సీక్రెట్‌గా ఎలా రూపొందిస్తారు... ఆర్థిక మంత్రి తీసుకునే జాగ్రత్తలేంటి?

Union Budget 2019 : బడ్జెట్ రూపకల్పన అనేది ఓ రహస్య ప్రక్రియ. ఈ ప్రాసెస్ ముగిసేవరకూ, నార్త్ బ్లాక్ ఓ పెట్టని కోటలా మారిపోతుంది. అక్కడ ఎలక్ట్రానికి స్వీపింగ్ యంత్రాల్ని ఏర్పాటుచేస్తారు. ప్రజలు ఆర్థిక శాఖకు ఈమెయిల్స్ పంపే అవకాశం ఉండదు. ఆర్థిక శాఖలోని చాలా కంప్యూటర్లను బ్లాక్ (వాడుకునే అనుమతి రద్దు) చేస్తారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 7, 2019, 7:57 AM IST
కేంద్ర బడ్జెట్‌ను సీక్రెట్‌గా ఎలా రూపొందిస్తారు... ఆర్థిక మంత్రి తీసుకునే జాగ్రత్తలేంటి?
నిర్మల సీతారామన్
  • Share this:
నరేంద్ర మోదీ సారధ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్‌ను జులై 5న లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. తనకు ఆర్థిక శాఖ ఇస్తారని ఆమె కూడా అనుకొని ఉండరు. గత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం వల్ల తనంతట తానుగా పదవి నుంచీ తప్పుకోవడంతో, ఇదివరకు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా చేసిన పియూష్ గోయల్‌కి అవకాశం ఇస్తారని అనుకున్నారు. ఫిబ్రవరిలో ఆయన మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు కూడా. కానీ మోదీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇంతకు ముందు రక్షణ శాఖను సమర్థంగా నిర్వహించిన సీతారామన్... ఇప్పుడు నార్త్ బ్లాక్‌లో బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నారు. ఐతే ఆమె ముందు చాలా సవాళ్లున్నాయి. ఈమధ్య దేశ పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోయింది. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. వాటిని క్యాష్‌గా మలచకపోతే, నగదు కొరత ఎక్కువవుతుంది. బ్యాంకింగేతర సంస్థల్లో కూడా నగదు కొరత ఉంది. నిరుద్యోగమైతే 45 ఏళ్లలో తొలిసారి అత్యధికంగా ఉంది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు తగ్గిపోయాయి. ఎగుమతులు తగ్గాయి. వ్యవసాయ రంగం కూడా దెబ్బతింది. ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితి ఉంది.

ఎన్నో సవాళ్ల మధ్య బడ్జెట్ కసరత్తు ప్రారంభించారు నిర్మలా సీతారామన్. ఆమె కోసం ఓ బృందం ఈ పనిలో నిమగ్నమైంది. జూన్ 3న మొదలైన ప్రక్రియ... జులై 5న బడ్జెట్‌‍ను ప్రవేశపెట్టేవరకూ సాగనుంది. ఈ సమయంలో నార్త్ బ్లాక్ లోకి బయటి వ్యక్తులెవర్నీ అనుమతించరు. బడ్జెట్ కసరత్తులో పాల్గొన్న వారిని కలిసేందుకు మీడియాకు కూడా అనుమతి లేదు.

బడ్జెట్ రూపకల్పన అనేది ఓ రహస్య ప్రక్రియ. ఈ ప్రాసెస్ ముగిసేవరకూ, నార్త్ బ్లాక్ ఓ పెట్టని కోటలా మారిపోతుంది. అక్కడ ఎలక్ట్రానికి స్వీపింగ్ యంత్రాల్ని ఏర్పాటుచేస్తారు. ప్రజలు ఆర్థిక శాఖకు ఈమెయిల్స్ పంపే అవకాశం ఉండదు. ఆర్థిక శాఖలోని చాలా కంప్యూటర్లను బ్లాక్ (వాడుకునే అనుమతి రద్దు) చేస్తారు.

ప్రస్తుతం నార్త్ బ్లాక్‌లో వ్యక్తిగత మొబైళ్ల వాడకాన్ని నిలిపివేశారు. ఒకే ఒక్క ల్యాండ్ లైన్ ఫోన్ మాత్రమే పనిచేస్తోంది. ఐతే, ఆ ఫోనుతో ఎవరికీ కాల్స్ చేసే అవకాశం లేదు.



ఆర్థిక శాఖ కార్యాలయంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల దగ్గరా టైట్ సెక్యూరిటీ ఉంది. వాళ్లు 24 గంటలూ నిఘా పెడుతున్నారు. నార్త్ బ్లాక్ చుట్టూ ఏం జరుగుతోందో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు.

దాదాపు 100 మంది అధికారులు బడ్జెట్ రూపకల్పనా ప్రక్రియలో పాల్గొంటున్నారు. వాళ్లెవరూ నార్త్ బ్లాక్ దాటి బయటకు రాలేని పరిస్థితి. వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక డాక్టర్ల బృందం పనిచేస్తోంది.

17వ లోక్ సభలో తొలి దశ సమావేశాలు జూన్ 17న మొదలై, జులై 26 వరకూ కొనసాగుతాయి. జులై 4న 2019-20 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టి, మర్నాడు బడ్జెట్‌ను సభ ముందుకి తేబోతున్నారు.లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే తొలి మహిళ, తొలి మహిలా స్వతంత్ర ఆర్థిక శాఖా మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. 1970-71లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ... ఆర్థిక శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు.
First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు