Union Bank of India cuts home loan rates : సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా? తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించే బ్యాంకుల కోసం అన్వేషిస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందజేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India-యూబీఐ) గృహ రుణగ్రహీతలకు తీపి కబురు అందించింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎన్నడూ లేని విధంగా (all-time low) హోం లోన్ వడ్డీరేట్లను కనిష్ఠానికి తగ్గించేసింది. హోం లోన్ వడ్డీరేట్లను 6.40 శాతానికి తగ్గిస్తున్నట్లు యూబీఐ మంగళవారం ప్రకటించింది.
కొత్తగా తగ్గించిన వడ్డీ రేటు అక్టోబర్ 27, 2021 నుంచి అమలులోకి వస్తుందని యూబీఐ తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గృహ రుణ వడ్డీ రేట్లలో తగ్గింపు ప్రకటించడంతో.. ఇప్పుడు కనీస వడ్డీ రేటు 6.40 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇంత తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలు ఆఫర్ చేయడం ఇదే తొలిసారి అని యూనియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు లేదా బ్యాలెన్స్ బదిలీలతో సహా ప్రస్తుత రుణాలను యూనియన్ బ్యాంకుకు బదిలీ చేయాలనుకునే వారికి కొత్త రేట్లు వర్తిస్తాయని యూబీఐ వెల్లడించింది.
అన్ని బ్యాంకుల కన్నా అతి తక్కువ వడ్డీ..
పండుగ సీజన్‌లో గృహా రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నామని యూబీఐ వివరించింది. కస్టమర్లు ఈ ఆఫర్ ద్వారా తమ జీవితంలో తీసుకునే అతి పెద్ద అప్పు విషయంలో ప్రయోజనం పొందగలరని పేర్కొంది. ఈ తగ్గిన వడ్డీ రేటుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్స్ ఇచ్చే అన్ని ఇతర బ్యాంకులకు గట్టి పోటీని ఇస్తుందని తెలిపింది. ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.50 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.60 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ 6.70 శాతం వడ్డీ రేట్లతో గృహ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పండగ సీజన్ లో ఈ ప్రత్యేక వడ్డీరేట్లను తీసుకొచ్చాయి.
ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునేవారు అతి తక్కువ వడ్డీ రేట్లకు లభించే రుణాలు తీసుకోవడం ఉత్తమం. ఈ అప్పు సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లోన్ తీసుకునే ముందు ఆ రుణం మీరు సులభంగా కట్టగలరా లేదా అనేది కూడా బేరీజు వేసుకోవాలి. అలాగే వడ్డీ రేటు గృహరుణం తో సమానం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే ఒక వైపు వాయిదాలు.. మరోవైపు వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్థిక ప్రణాళికలు రచించాలి. ముందస్తుగా అప్పు భారాన్ని తగ్గించుకునేందుకు కూడా ఆసక్తి చూపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan