Trump social media: ట్రంప్‌కు మరోసారి షాకిచ్చిన ట్విట్టర్..అయ్యో పాపం...ఉన్న పరువు గోవిందా...

డొనాల్డ్ ట్రంప్

Trump social media: ట్రంప్‌కు మరోసారి షాకిచ్చిన ట్విట్టర్.. ఆ పోస్టులను షేర్ చేస్తున్న మరో అకౌంట్‌పై నిషేధం...

  • Share this:
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై షార్ట్ మెస్సేజింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను షేర్ చేస్తున్న ఒక ట్విట్టర్ అకౌంట్‌ను.. సంస్థ తన ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. ట్రంప్ తరఫున @DJTDesk అనే అకౌంట్‌ ట్వీట్లు చేస్తున్నట్లు ట్విట్టర్ గుర్తించింది. ట్రంప్ ఈ మంగళవారం "ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె ట్రంప్" పేరుతో సొంత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఆయన చేస్తున్న పోస్టులు ట్విట్టర్‌లో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని @DJTDesk ట్విట్టర్ అకౌంట్‌ షేర్ చేస్తున్నట్టు సంస్థ గ్రహించింది. దీంతో ట్రంప్‌పై గతంలో విధించిన నేషేధంలో భాగంగా ఈ అకౌంట్‌ను కూడా ట్విట్టర్ తొలగించింది.

ఇప్పటికే సస్పెండ్ చేసిన అకౌంట్‌కు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేస్తున్నందువల్ల.. ఈ అకౌంట్‌ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి అకౌంట్‌లు ఇంకా చాలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జనవరిలో హింసను ప్రేరేపించారనే కారణంతో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లను వివిధ సంస్థలు తొలగించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ శ్వాశ్వతంగా ఆయన అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఇటీవల ట్రంప్ కొత్త కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ట్రంప్ కొత్త ప్లాట్‌ఫామ్ నుంచి కంటెంట్‌ను పంచుకుంటున్న మరిన్ని ట్విట్టర్ అకౌంట్లు ప్లాట్‌ఫాంలో ఉన్నాయి. వీటిపై సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ అకౌంట్లను ఎవరు నిర్వహిస్తున్నారనే వివరాలపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ విషయంపై ట్రంప్ ప్రతినిధి జాసన్ మిల్లెర్ వార్తాసంస్థలతో మాట్లాడారు. ట్విట్టర్ తొలగించిన @DJTDesk అనే అకౌంట్‌కు, ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఈ అకౌంట్‌ బయోలో ట్రంప్‌కు సంబంధించిన సమాచారం ఉంది. అమెరికా 45వ అధ్యక్షుడి తరఫున ఈ పోస్టులు చేస్తున్నట్టు, DonaldJTrump/Desk ద్వారా వీటిని కాపీ చేసినట్లు ఈ అకౌంట్ బయోలో పేర్కొన్నారు. ట్రంప్‌కు చెందిన కొత్త వెబ్‌సైట్ నుంచి కంటెంట్‌ను షేర్ చేయడానికి ట్విట్టర్ అనుమతించింది. కానీ ఆయనపై విధించిన నిషేధాన్ని తప్పించుకోవడానికి పాల్పడే చర్యలను అడ్డుకుంటామని సంస్థ వెల్లడించింది.

ట్రంప్‌కు చెందిన కొత్త కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం ‘ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె ట్రంప్’.. మాజీ అధ్యక్షుడు చేసిన ప్రకటనలు, ప్రెస్ నోట్లను పంచుకుంటోంది. ఈ ప్లాట్‌ఫాంలోని పోస్టులను విజటర్లు లైక్ చేయవచ్చు. అవసరమైతే తమ ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లకు ఈ పోస్టులను షేర్ చేసుకోవచ్చు. కానీ గతంలో విధించిన నిషేధానికి సంబంధించిన నియమ, నిబంధనలకు లోబడి ఉంటేనే ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇందుకు అనుమతిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: