ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్‌ను(Twitter) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించాయి. మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లకు(US Dollars) కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మన కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా(Private Company) మారనుంది. ప్రస్తుతం మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు సీఈవోగా (Twitter CEO) భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(Twitter CEO Parag Agarwal) ఉన్న విషయం తెలిసిందే. అయితే పాత మేనేజ్‌మెంట్‌ను మస్క్ కొనసాగిస్తారా లేదా అనే అనుమానం సంస్థ ఉద్యోగుల్లో ఉంది. ఇప్పటికే పాత మేనేజ్‌మెంట్‌పై(Management) నమ్మకం లేదని మస్క్ సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఈవో పరాగ్‌ను కూడా ఆయన పదవి తప్పిస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది.
అయితే పరాగ్ అగర్వాల్‌ను సీఈవో పదవి నుంచి తప్పిస్తే.. కంపెనీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సీఈఓగా నియమితులైన తర్వాత 12 నెలల్లోపు పరాగ్‌ను పదవి నుంచి తొలగిస్తే.. ఇందుకు 42 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని అంచనా. ఈక్విలర్ అనే పరిశోధనా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకొనే మస్క్, ఒకవేళ పరాగ్‌ను సీఈఓగా తప్పిస్తే.. 42 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ.321 కోట్లు పరిహారంగా చెల్లించాల్సిందే.
ఈ పరిహారాన్ని ఈక్విలర్ అనే పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. ఇందుకు పరాగ్ అగర్వాల్ ఒక సంవత్సరం బేసిక్ శాలరీ, ఈక్విటీల విలువ వంటివి పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంపై ఈక్విలర్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ట్విట్టర్‌కు మస్క్ ప్రకటించిన ఆఫర్ ధర ఒక్కో షేరుకు 54.20 డాలర్లుగా ఉందని, దీనికి తోడు కంపెనీకి సంబంధించిన ఇటీవలి ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లోని నిబంధనలను విశ్లేషించామని చెప్పారు. ఈ నియమ, నిబంధనల ఆధారంగా సీఈఓకు చెల్లించే పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని తెలిపారు. అయితే ఈక్విలార్ అంచనాలపై వ్యాఖ్యానించడానికి ట్విట్టర్ ప్రతినిధులు నిరాకరించారు.
ముంబైకి చెందిన పరాగ్, గతంలో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది నవంబర్‌లో సంస్థ వ్యవస్థాపకులు జాక్ డోర్సే నుంచి పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ట్విట్టర్ టేకోవర్‌పై పరాగ్ కూడా స్పందించారు. సంస్థతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ నిర్ణయం పైనే ట్విట్టర్ ఉద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.