TSRTC ANNOUNCED NIGHT SERVICES IN HYDERABAD HERE TIMINGS DETAILS NS
TSRTC Hyd Night Services: హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ శుభవార్త.. రాత్రంతా సిటీ బస్సులు.. రూట్లు, టైమింగ్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ వాసులకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. రాత్రంతా సిటీ బస్సులను (City Buses) నడపనున్నట్లు ప్రకటించింది. ఆయా బస్సులకు సంబంధించిన రూట్లు, టైమింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
లాభ నష్టాల మాట ఎలా ఉన్నా.. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మాత్రం ప్రయాణికులకు తన సేవలను మరింత విస్తరిస్తుందే తప్పా.. ఏ మాత్రం తగ్గించడం లేదు. కొత్త కొత్త ఆఫర్లు, స్కీంలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం సైతం చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. లాభాలను పెంచుకోవడం కోసం కార్గో సేవలను సైతం తక్కువ ధరకే ఆర్టీసీ అందిస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్టీసీలో అనేక మార్పులు వచ్చాయి. సంస్థను లాభాల బాటలో నడిపించడమే కాకుండా.. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు సజ్జనార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాధారణంగా రాత్రి 10, 11 గంటల వరకు మాత్రమే సిటీ బస్సులు హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తాయి. అనంతరం ఉదయం ఆయా ప్రాంతాలను బట్టి ఉదయం 4, 5 గంటలకు తిరిగి తమ సేవలను ప్రారంభిస్తాయి ఆర్టీసీ బస్సులు.
అయితే గ్రేటర్ పరిధిలో రాత్రంతా బస్సులను నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్-పటాన్ చెరు, పటాన్ చెరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-చార్మినార్, చార్మినార్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సీబీఎస్, సీబీఎస్-సికింద్రాబాద్ తదితర మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు సజ్జనార్. ఇంకా ఆయా బస్సులు ప్రారంభమయ్యే సమయాలను సైతం వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్-పటాన్ చెరు బస్సులు రాత్రి 12:15, 01:20, 2:25, 3:30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభం అవుతాయి.
పటాన్ చెరు-సికింద్రాబాద్: ఈ మార్గాల్లో 12:15, 01:20, 2:25, 3:30 గంటలకు బస్సులు పటాన్ చెరు నుంచి ప్రారంభం అవుతాయి.
సికింద్రాబాద్-చార్మినార్: ఈ మార్గంలో రాత్రి 22:40, 12:20, 02:00 గంటలకు బస్సులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభం అవుతాయి.
ఈ సర్వీసులు ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేవారు సద్వినియోగం చేసుకోవచ్చు. అనేక మంత్రి రాత్రి పూట స్టేషన్ నుంచి రావడానికి, స్టేషన్ కు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు ఉండకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్యాబ్ లు ఆటోలను ఆశ్రయిస్తారు. అలాంటివారు ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.