తెలంగాణకు మరో టెక్స్ టైల్ పరిశ్రమ.. అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి కేటీఆర్..

ఒప్పంద కార్యక్రమంలో కేటీఆర్, అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రగతిభవన్లో టెక్స్ టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ఉన్నతాధికారులతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

 • Share this:
  తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రగతిభవన్లో టెక్స్ టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ఉన్నతాధికారులతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం సుమారు 65 ఎకరాల్లో పొద్దురు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటికే ఈ పార్కు కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఈ పార్కు పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమ తో పాటు స్థూలంగా టెక్స్టైల్ , అప్పారాల్ పరిశ్రమకి అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కార్యాచరణతో ముందుకు పోతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు విజయవంతంగా ఈ పార్కు కి ప్రముఖ అప్పారెల్  కంపెనీని తీసుకురాగలిగింది.

  గోకల్ దాస్ ఇమేజెస్  కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెట్టుబడి కార్యాచరణను వివరించారు. తమ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా సుమారు 1100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఇందులో మహిళలకు 75 శాతం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్న మహిళలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తో కలిసి చేపడతామని తెలిపారు.  తమ కంపెనీ 4 నాలుగు దశాబ్దాలకు పైగా అప్పారెల్ రంగంలో ఉన్నదని, ముఖ్యంగా రెడీమేడ్ వస్త్రాల తయారీలో విస్తృతమైన శ్రేణిలో తమ కంపెనీ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడి స్నేహపూర్వక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి బ్రాండ్లకు తమ కంపెనీ వస్త్రాలను సరఫరా చేస్తుందని ప్రస్తుతం సిరిసిల్లలో ప్రారంభించబోయే ఫ్యాక్టరీ నుంచి అమెరికా, యూరప్ లోని ప్రముఖ బ్రాండ్ లకు దుస్తులను అందిస్తామన్నారు.

  గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావడం పట్ల తెలంగాణ  టెక్స్ టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే టెక్స్ టైల్   రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం తన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా ఉంచి అనేక కార్యక్రమాలను చేపడుతోందని, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు శిక్షణ కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్ టైల్ పరిశ్రమలో ఇప్పటిదాకా ప్రధానంగా వస్త్రాల తయారీ ఉందని ఈరోజు ఈ కంపెనీ కార్యకలాపాల ద్వారా రెడీ టు వేర్/ రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైందన్నారు.

  ఈ పరిశ్రమ తన కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మరిన్ని అప్పారెల్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. గోకల్ దాస్ కంపెనీని సిరిసిల్ల కు ఆహ్వానించిన మంత్రి కేటీఆర్, కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్ మరియు టిఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహా రెడ్డి మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  Published by:Veera Babu
  First published: