TRANSITION GENERATION WILL LEAD INDIA TOWARDS GLOBAL ENERGY LEADERSHIP SAYS MUKESH AMBANI GH VB
Mukesh Ambani: 2030 నాటికి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా ఆసియా.. ఇంధన రంగంలో భారత్ దూసుకెళ్తుందన్న ముఖేష్ అంబానీ..!
ఆసియా ఎకనామిక్ డైలాగ్ సదస్సులో మాట్లాడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ అండ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ
పుణె ఇంటర్నేషనల్ సెంటర్ (Pune International Center), కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆసియా ఎకనామిక్ డైలాగ్ (AED- Asia Economic Dialogue) సమ్మిట్ నేడు ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ అండ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మాట్లాడుతూ..
పుణె ఇంటర్నేషనల్ సెంటర్ (Pune International Center), కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆసియా ఎకనామిక్ డైలాగ్ (AED- Asia Economic Dialogue) సమ్మిట్ నేడు ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు ఈ సదస్సు కొనసాగనుంది. ఈ ఏడాది సమ్మిట్ నినాదాన్ని ‘Resilient Global Growth In a Post Pandemic World’(కరోనా విపత్తు తర్వాత స్థితిస్థాపకంగా ప్రపంచాభివృద్ధి)గా నిర్ణయించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ అండ్ ఛైర్మన్ ముకేష్ అంబానీ మాట్లాడారు. ‘21వ శతాబ్దంలో గ్లోబల్ ఎకానమీ(Global Economy) దాదాపు ఆసియా దేశాలపై ఆధారపడుతుంది. గడిచే ప్రతి ఏడాదికి ఆసియా ప్రాబల్యం పెరుగుతుంది. 2030 సంవత్సరానికల్లా ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఆసియా భాగస్వామ్యం 60 శాతానికి పెరుగుతుంది. మొదటి నుంచి 18వ శతాబ్దం వరకు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఆసియా భాగస్వామ్యమే కీలకం. గత రెండు శతాబ్ధాల్లో వెనుకబడిన ఆసియా మళ్లీ పుంజుకొంటోంది.
2020లో మిగతా అన్ని దేశాల జీడీపీ కంటే ఆసియా దేశాల జీడీపీనే ఎక్కువ. రానున్న రెండు దశాబ్దాల్లో ఆసియా దేశాల్లో పేదరికం తగ్గుతుందని ఎక్కువగా మధ్య తరగతి కుటుంబ ప్రజలు ఉంటారు. 2030కి ఇండియా జపాన్ను దాటి ఆసియాలో రెండో అతి పెద్ద ఎకానమీ, ప్రపంచంలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదుగుతుంది’ అని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీపై ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘మనకు ఒక భూమి మాత్రమే ఉంది. అన్ని జీవరాశులు దీనిపై ఆధారపడి ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో భూమిపై మనుగడ నానాటికీ విషమిస్తోంది. గడిచిన రెండేళ్లలో భూమిపై సహజ వనరులను విపరీతంగా వినియోగించారు. దీని ద్వారా చాలా దేశాలు అభివృద్ధి బాటలో నడిచాయనేది కాదనలేని నిజం. ఆ అభివృద్ధి భూమికి శాపంగా మారింది. ఇది ఇక కొనసాగకూడదు. నేను ప్రకృతి ప్రేమికుడిగా చెబుతున్నాను. భూమి తల్లి సంపదను ముందు తరాలకు మనం అందించాలి.
హరిత ఇంధనం, స్వచ్ఛ ఇంధనంవైపు ప్రపంచం మారడం అత్యవసరంగా చేపట్టాల్సిన అంశం. సౌర, పవన విద్యుత్తును ప్రోత్సహించాలి. ఇంధన రంగంలో వచ్చిన మార్పులతో ప్రపంచ రాజకీయ ముఖచిత్రాలు మారుతాయి. కట్టెల స్థానంలో బొగ్గు వచ్చినప్పుడు యూరప్ భారత్‌ను దాటేసింది. చైనా మొదటి మొదటిస్థానానికి చేరిందని గుర్తించాలి. హరిత, స్వచ్ఛ ఇంధనాలను ఎగుమతి చేసే స్థాయిలో ఇండియా ఉంది. గ్లోబల్ లీడర్‌గా ఎదిగే అవకాశం భారత్ కు ఉంది. హరిత ఇంధన రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి భూ వాతావరణాన్ని కాలుష్యంలోకి నెట్టిందని, ప్రస్తుతం అందుకు విభిన్నంగా భూమాతను రక్షించుకొనే పద్ధతిలో అభివృద్ధి జరుగుతుందని అంబానీ తెలిపారు. ప్రకృతి నుంచి మనం నేర్చుకొనే సమయమిదని అభిప్రాయపడ్డారు. నీటిలోని హైడ్రోజన్, సూర్యరశ్మి నుంచి శక్తిని జనరేట్ చేయడం ప్రకృతి నుంచి నేర్చకొన్నదే అని, అలాంటి ప్రకృతే మనకు కార్బన్ సైకిల్‌ను అందించిందని, అది మనకున్న ఆస్తి అన్నారు. కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్(CCUS) టెక్నాలజీ పెరుగుతుందని, వాతావరణంలోని కార్బన్ శాతం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ప్రతి ఒక్కరు సొంతంగా విద్యుత్తు రూపొందించుకొనేలా చేస్తే, ఇంధనాలను ఇతర దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉండదన్నారు. ఎర్త్- ఫ్రెండ్లీ రెవెల్యూషన్ తీసుకురావాలని పిలుపునిచ్చారు. అందుకే కేర్ ఫర్ ది ప్లానెట్, కేర్ ఫర్ ది పీపుల్ నినాదాలను ఆదర్శంగా తీసుకొని రిలయన్స్ పని చేస్తోందని పేర్కొన్నారు.
ఇటీవలే కేంద్ర మంత్రి హైడ్రోజన్ పంప్స్‌పై ప్రకటన చేశారని, ప్రపంచంలోనే మొదటిసారని, న్యూ ఎనర్జీలో ప్రపంచానికి ఇండియా మార్గదర్శకమవుతుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆత్మ నిర్బర్ పథకం ద్వారా ఇండియా హరిత ఇంధనం ఎగుమతి చేసే స్థాయికి చేరుతుందన్నారు. ప్రస్తుతం మొదటి 20 స్థానాల్లో ఉన్న ఎనర్జీ, టెక్నాలజీ రంగంలోని కంపెనీలు వచ్చే 20 ఏళ్లలో రిలయన్స్ స్థాయికి చేరుతాయని అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్‌కు 1 బిలియన్ కంపెనీ అవ్వడానికి పదేళ్లు, 10 బిలియన్ల కంపెనీ కావడానికి 30 ఏళ్లు, 100 బిలియన్ల కంపెనీ అవ్వడానికి 35 ఏళ్లు, 200 బిలియన్ల కంపెనీ పట్టడానికి 38 ఏళ్లు పట్టిందని వివరించారు. ఐటీ, ఇంధన రంగాల్లో 20 ఏళ్లలో భారత్ ఊహించని అభివృద్ధి సాధిస్తుందన్నారు.
భారత ప్రభుత్వం హరిత ఇంధనం, స్వచ్ఛ ఇంధనాలను ప్రోత్సహిస్తోందని, ఇటీవల బడ్జెట్లో ఎనర్జీ బాండ్స్‌ను ప్రకటించారని అంబానీ తెలిపారు. 2030కి సాధించాల్సిన పునరుత్పాదక ఇంధనంలో 2021కే 40 శాతం లక్ష్యం చేరుకొన్నామని చెప్పారు. హరిత ఇంధన రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతుందని, ఇండియాకి ఉన్న యువశక్తి 20 ఏళ్లలో భారత్‌ను ప్రపంచానికి ఇంధన రంగంలో ఆదర్శంగా నిలుపుతుందని చెప్పారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.