Paytm: ఇక ట్రాఫిక్ చలాన్లకు కూడా పేటీఎం కరో.. కొత్తగా ఏ నగరంలో అంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

ఫైన్​లు చెల్లించేందుకు సులభ మార్గాన్ని తీసుకొచ్చారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. వేగంగా, ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఫైన్​ కట్టేందుకు మార్గం చూపించారు. పేటీఎం ద్వారానే డబ్బు చెల్లించే సదుపాయాన్ని కల్పించారు.

  • Share this:
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలకు గురైన వారు ఫైన్​లు చెల్లించేందుకు సులభ మార్గాన్ని తీసుకొచ్చారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. వేగంగా, ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఫైన్​ కట్టేందుకు మార్గం చూపించారు. పేటీఎం ద్వారానే డబ్బు చెల్లించే సదుపాయాన్ని కల్పించారు. ఈ విషయాన్ని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్​ వెల్లడించారు. క్యాష్​లెస్ ఫైన్ పేమెంట్ల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చామని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రారంభించాక పోలీసు జాయింట్ కమిషనర్​ బీఆర్ రవికాంతె గౌడ పూర్తి వివరాలు వెల్లడించారు. పేటీఎం సదుపాయాన్ని తీసుకురావడం వెనుక కారణాలను వివరించారు.

“ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఫైన్లు క్రెడిట్​కార్డులు, డెబిట్​కార్డుల ద్వారా చెల్లించే సదుపాయం 2017 నుంచే ఉంది. అయితే కార్డుల ద్వారా పేమెంట్స్ చేసే సమయంలో కొన్ని బ్యాంకులు కార్డుదారుల నుంచి అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలనుకున్నాం. అదనపు చార్జీలు లేకుండా ఫైన్లు చెల్లింటే విధానం కోసం వెతికాం. అందుకే పేటీఎంను ఎంచుకున్నాం” అని రవికాంతె గౌడ వెల్లడించారు.

బెంగళూరు-వన్​, బెంగళూరు ట్రాఫిక్ పోలీసు (బీటీపీ) వెబ్​సైట్ల ద్వారా, పీడీఏ మెషీన్ల ద్వారా వాహనదారులు ఇప్పటి వరకు ట్రాఫిక్ ఫైన్లను చెల్లించే సదుపాయం ఉంది. వీటి పేమెంట్ ఆప్షన్లలో ఇప్పుడు పేటీఎం కూడా వచ్చేసింది. అలాగే పేటీఎం యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చు. దీంతో ఎలాంటి అదనపు బ్యాంకు చార్జీలు లేకుండా ఫైన్లు పడిన వారు డబ్బును చెల్లించవచ్చు. అయితే పేటీఎం ద్వారా చలాన్లు కట్టే సదుపాయం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఉంది.

బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ టెలీ బ్రహ్మాస్​.. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసే టెక్నాలజీని డెవలప్​ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన పేటీఎం ద్వారా ఫైన్​లు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు.

పేటీఎం ట్రాఫిక్​ చలాన్​ ఈ-పేమెంట్స్ సదుపాయం ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, ఫరీదాబాద్​ల్లో ఉంది. ఈ సదుపాయం వల్ల చలాన్ల చెల్లింపులోనూ పెరుగుదల కనిపించింది. అలాగే బిహార్​, పశ్చిమ బెంగాల్​, గురుగ్రామ్​ల్లో కూడా ఈ పేమెంట్స్ సౌకర్యం తెచ్చేందుకు పేటీఎంకు అనుమతులు అందాయి.

చలాన్ల పేమెంట్స్ చేసేందుకు, ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యాప్​లో చలాన్​ అని ట్రాఫిక్ సిగ్నల్స్ సింబల్​​తో ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక రాష్ట్రం/నగరాన్ని ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని వాహన రిజిస్ట్రేషన్​ (ఆర్​సీ) నంబరు లేదా చలాన్ నంబర్​ ఎంటర్ చేస్తే ఎంత మొత్తం కట్టాలో కనిపిస్తుంది. ఆ తర్వాత పేమెంట్ చేయాలి.
Published by:Krishna Adithya
First published: