TRADERS ASSOCIATION URGES AMAZON JEFF BEZOS TO NOT BLOCK RELIANCE FUTURE DEAL SK
Reliance-Future group Deal: రిలయన్స్-ఫ్యూచర్ డీల్‌కు అడ్డుపడొద్దు.. అమెజాన్ సీఈవోకు వర్తక సంఘాల బహిరంగ లేఖ
జెఫ్ బెజోస్
రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అడ్డంకులు సృష్టించవద్దని అమెజాన్ సీఈవోను వ్యాపారులు కోరారు. ఈ అనిశ్చితితో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. అమెజాన్ చేస్తున్న అనవసర రాద్ధాంతం వలన ఎంతో మంది వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్పై భారతీయ వర్తక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేశాయి. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై చట్టపరమైన వివాదం నెలకొన్న నేపథ్యంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఆల్ ఇండియా కన్సూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPD), పబ్లిక్ రెస్పాన్స్ ఆగెనెస్ట్ హెల్ప్నెస్ అండ్ యాక్షన్ ఫర్ రెడ్రెస్సల్ అనే ఎన్జీవో సంస్థ లేఖ రాశాయి. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అడ్డంకులు సృష్టించవద్దని లేఖలో వర్తకలు కోరారు. ఈ అనిశ్చితితో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. అమెజాన్ చేస్తున్న అనవసర రాద్ధాంతం వలన ఎంతో మంది వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
6వేలకు పైగా చిన్న వ్యాపారులకు సంబంధించిన రూ.6వేల కోట్లు.. 2020, మార్చి నుంచి ఫ్యూచర్ గ్రూప్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని AICPD తెలిపింది. ''ప్రపంచంపై గుత్తాధిపత్యం కోసం మీరు ఆడుతున్న క్రీడలో మేం కోలుకోలేనంతగా నష్టపోతున్నాం. మా వ్యాపారుల చెల్లింపులు ఆగిపోయాయి. మా కుటుంబాలంతా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి. మానసిక, భావోద్వేగ ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ వ్యవహారంలో మీరు కలగజేసుకోకుండా తప్పుకోండి. లేదంటే మాకు డబ్బులైనా చెల్లించండి.'' అని లేఖలో పేర్కొనారు.
ఆగస్టు 29, 2020న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్‌లో కొన్ని విభాగాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లో మణిహారంలా పేరుపొందిన రిటైల్ బిజినెస్ విభాగాన్ని ముఖేష్ అంబానీకి అప్పగించింది. ఈ మెగా లావాదేవీతో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, హోల్ సేల్ విభాగాలు రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు (RRFLL) బదిలీ అవుతాయి. ఐతే అమెజాన్ జోక్యం చేసుకోవడంతో.. ఈ మెగా ఒప్పందానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి.
ఐతే ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు 49 శాతం వాటా ఉంది. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి తమకు సమ్మతం కాదని.. తమ అంగీకారం లేకుండా ఈ లావాదేవీ జరగలేదని కోర్టులో సవాల్ చేసింది. చట్టాలను ఉల్లంఘించి ఇరు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించింది. ఐతే అమెజాన్ ఆరోపణలను ఫ్యూచర్ గ్రూప్ ముందు నుంచీ ఖండిస్తూ వస్తోంది. రియలన్స్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అమెజాన్ అడ్డంకులు సృష్టిస్తున్న కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు లేఖరాశారు.