news18-telugu
Updated: November 24, 2020, 7:19 PM IST
ప్రతీకాత్మకచిత్రం
టయోటా కిర్లోస్కర్ మోటార్ అప్డేటెడ్ ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) వాహనాన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ.16.26 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కొత్త ఇన్నోవా క్రిస్టా కొత్త ఎక్స్టీరియర్ డిజైన్‌తో లభిస్తుంది. హెడ్‌ల్యాంప్స్ వరకు ఉండే కొత్త ట్రాపెజోయిడల్ పియానో బ్లాక్ గ్రిల్, షార్పర్ ఫ్రంట్ బంపర్ డిజైన్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏడు ఎయిర్‌బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లతో ఈ వాహనం సురక్షితమైన వాహనాల్లో ఒకటిగా పేరొందింది. పార్కింగ్ చేసేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి MID డిస్ప్లేతో ఫ్రంట్ క్లియరెన్స్ సోనార్ ఉంటుంది. ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభూతిని ఇచ్చేలా సరికొత్త ఫీచర్లతో ఈ కారును రూపొందించామని టొయోటా తెలిపింది.
ఇంటీరియర్ మార్పులు కూడా...జెడ్ఎక్స్ గ్రేడ్‌లో క్యామెల్ టాన్ ఉండే కొత్త కలర్ ఆప్షన్‌తో ఇంటీరియర్ సరికొత్తగా కనిపిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ చేసిన ఇన్నోవాలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కనెక్ట్ అయ్యే స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్ ఆడియోను పొందుపరిచారు. రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, లాస్ట్ పార్క్డ్ లొకేషన్ వంటి సరికొత్త వెహికిల్ కనెక్టివిటీ ఫీచర్లను వినియోగదారులు వాడుకోవచ్చు.
అప్డేట్ చేస్తున్నారు
ఈ సరికొత్త ఇన్నోవా కస్టమర్లను ఆకట్టుకుంటుందని టీకేఎం సేల్స్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని చెబుతున్నారు. ‘మొట్టమొదటిసారి ఇన్నోవాను 15 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టాం. సౌకర్యం, సౌలభ్యం, టయోటా బ్రాండ్ నాణ్యత, విశ్వసనీయతతో ప్రీమియం ఎంపీవీ విభాగంలో ఇన్నోవా విజేతగా నిలిచింది. అప్పటి నుంచి టెక్నాలజీ, ఫీచర్లను అప్డేట్ చేస్తూ ఇన్నోవాను ఎప్పటికప్పుడూ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. సరికొత్త ఇన్నోవా క్రిస్టా కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తుంది’ అని వివరించారు.
ఆ విభాగంలో అత్యధిక అమ్మకాలు
ఇన్నోవా తాజా అవతార్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని నవీన్ తెలిపారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్లకు ఈ వాహనం సౌకర్యంగా ఉంటుంది. కుటుంబంతో లేదా వ్యాపార అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు సాటిలేని భద్రత, సౌకర్యాన్ని కోరుకునే కస్టమర్లు క్రిస్టాను ఎంచుకోవచ్చు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన MPVల జాబితాలో ఇన్నోవాను అగ్ర స్థానంలో నిలబెట్టిన కస్టమర్లకు టయోటా ధన్యవాదాలు తెలిపింది. ఈ విభాగంలో ఇన్నోవాకు 43 శాతం మార్కెట్ వాటా ఉండటం విశేషం. ఈ ఆధిపత్యాన్ని ఇన్నోవా క్రిస్టా కూడా కొనసాగిస్తోందని నవీన్ సోనీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by:
Krishna Adithya
First published:
November 24, 2020, 7:19 PM IST