హోమ్ /వార్తలు /బిజినెస్ /

Toyota Cars: భారత్‌లో టయోటా సంచలన నిర్ణయం...మోదీ ప్రభుత్వానికి షాక్...

Toyota Cars: భారత్‌లో టయోటా సంచలన నిర్ణయం...మోదీ ప్రభుత్వానికి షాక్...

ఫార్చ్యునర్ కారు (ప్రతీకాత్మక  చిత్రం)

ఫార్చ్యునర్ కారు (ప్రతీకాత్మక చిత్రం)

పన్నుల భారం కారణంగా భారతదేశంలో విస్తరణ పనులను ఆపేస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి మిగిల్చిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ సంస్థలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రికి ఇది ఒక ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

పన్నుల భారం కారణంగా భారతదేశంలో విస్తరణ పనులను ఆపేస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి మిగిల్చిన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ సంస్థలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రికి ఇది ఒక ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. కార్లు, మోటారుబైకులపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ఆటోమొబైల్ సంస్థల విస్తరణకు అవరోధంగా మారిందని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అంటున్నారు. “అధిక లెవీలు చాలా మంది వినియోగదారులకు కార్లను దూరం చేస్తున్నాయి. అంటే కర్మాగారాల్లో పని ఉండదు. తద్వారా ఉద్యోగాల కల్పన కూడా ఉండదు. మేము ఇక్కడకు వచ్చి డబ్బు పెట్టుబడి పెట్టిన తరువాత... మాకు మీ అవసరం లేదు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎటువంటి సంస్కరణలు లేనప్పుడు మేము మా సంస్థలను విస్తరించలేం. ఇదే సందర్భంలో భారతదేశం నుండి నిష్క్రమించలేం కూడా” అని ఆయన వివరించారు.

ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరైన టయోటా, 1997 లో భారతదేశంలో పనిచేయడం ప్రారంభించింది. దీని స్థానిక యూనిట్లో జపనీస్ కంపెనీకి 89% యాజమాన్య వాటా ఉంది. ఈ సంస్థకు మార్కెట్ వాటా తక్కువే. గతేడాది టయోటా మార్కెట్ వాటా ఐదు శాతంగా ఉండగా, ఈ ఆగస్టులో అది కేవలం 2.6శాతానికే పరిమితమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఈ గణాంకాలను వెల్లడించింది.

భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై దాదాపు 28శాతం అధిక పన్నులను ప్రభుత్వం విధిస్తోంది. దీంతోపాటు కారు రకం, పొడవు లేదా ఇంజిన్ పరిమాణం ఆధారంగా ఒకటి నుంచి 22శాతం వరకు అదనపు లెవీలు ఉంటున్నాయి. 1500 సిసి కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన నాలుగు మీటర్ల పొడవైన ఎస్యూవీపై పన్ను 50శాతం వరకు ఉంటుంది. సాధారణంగా లగ్జరీ వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తారు. భారత్లో కార్లతో పాటు సిగరెట్లు స్పార్క్లింగ్ వాటర్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తయారీ సంస్థలను ఆకర్షించడానికి భారతదేశం 23 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించాలని యోచిస్తోంది. అయినా అంతర్జాతీయ వాహన తయారీదారులు ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉన్న భారత్లో విస్తరించడానికి కష్టపడుతున్నారు.

జనరల్ మోటార్స్ సంస్థ 2017లోనే మన దేశాన్ని వీడింది. ఫోర్డ్ మోటార్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్తో జాయింట్ వెంచర్గా మారడానికి గత ఏడాది అంగీకరించింది. 2020 నాటికి తన మొదటి మూడు మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉండాలని లక్ష్యంతో వచ్చిన ఫోర్డ్.. ఇక్కడ స్వతంత్ర కార్యకలాపాలను ముగించింది. ఇటువంటి శిక్షాత్మక పన్నులు విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తాయని విశ్వనాథన్ అంటున్నారు. వాహన తయారీదారుల మార్జిన్లు తగ్గడంతో పాటు, కొత్త ఉత్పత్తులను ప్రారంభించటానికి అయ్యే ఖర్చుపై ఇవి వ్యతిరేక ప్రభావం చూపుతాయని ఆయన చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు ప్రస్తుతం 5శాతంగా ఉన్నాయి. వీటి అమ్మకాలు పెరిగిన తర్వాత పన్నులు కూడా పెరిగే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు కోసం మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వీటిపై తక్షణ ఒప్పందం ఉండకపోవచ్చు అని భారత భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు.

భారతదేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు కరోనావైరస్ మహమ్మారికి ముందు తిరోగమనంలో ఉన్నాయి. ఈ రంగంలో కనీసం అర మిలియన్ ఉద్యోగాలు పోయాయి. మందగమనానికి ముందు ఉన్న అమ్మకాల స్థాయిని తిరిగి చేరుకునేందుకు కంపెనీలకు సుమారు నాలుగు సంవత్సరాలు పట్టవచ్చని ఒక లాబీ గ్రూప్ అంచనా వేసింది.

కాంపాక్ట్, సరసమైన కార్ల మార్కెట్ వాటాలో సుజుకి, హ్యుందాయ్ మోటార్ కంపెనీలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ఈ విభాగాల్లో రెండు కంపెనీల మొత్తం వాటా 70% వరకు ఉంటుంది.భారతదేశంలో టయోటా ఎక్కువగా హైబ్రిడ్ వాహనాలపైనే దృష్టి పెట్టింది. ఇవి పూర్తిగా విద్యుత్తువి కానందున 43% పన్నులు విధిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే కారు కొనగలిగే దేశంగా ఉన్న భారత్లో, పర్యావరణ అనుకూలమైన EVలు, లేదా హైబ్రిడ్ వాహనాలు ఇంకా ఎక్కువ ఆమోదం పొందలేదు.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు