news18-telugu
Updated: November 17, 2020, 11:56 AM IST
ప్రతీకాత్మక చిత్రం
మెస్సేజింగ్ యాప్‌లలో రారాజుగా నిలుస్తున్న వాట్సాప్ యాప్ సెక్యూరిటీ ఫీచర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా వినియోగదారుల ప్రైవసీకి, సెక్యూరిటీకి ఆ సంస్థ భరోసా కల్పిస్తోంది. కానీ వాట్సాప్ తీసుకున్న తాజా చర్యలు ప్రైవసీ పాలసీల పరంగా విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఐఫోన్లలో వాట్సాప్‌ను వాడుతున్న వారు బ్యాకప్ మెస్సేజ్‌లను ఐ క్లౌడ్ డ్రైవ్‌కు (iCloud Drive)డిఫాల్ట్‌గా పంపేందుకు వాట్సాప్ అనుమతి ఇచ్చింది. దీంతో తమ ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని వినియోగదారులు భావిస్తున్నారు.
ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా వినియోగదారులకు వాట్సాప్ సెక్యూరిటీ కల్పిస్తోంది. కానీ ఐ క్లౌడ్ డ్రైవ్‌కు మెస్సేజ్‌లను బ్యాకప్ చేసుకోవడానికి ఇలాంటి ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్‌ను వాట్సాప్ అందించట్లేదు. దీంతో ఐక్లౌడ్ నుంచి ఇతరులు ఎవరైనా సులభంగా తమ చాట్ లిస్టును యాక్సెస్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రత విషయంలో వాట్సాప్ రాజీపడటం తగదని చాలామంది చెబుతున్నారు.
లొసుగులతో ప్రమాదం
తాజా ఫీచర్ వల్ల భద్రతాపరమైన లొసుగులను అవకాశంగా చేసుకొని ప్రభుత్వాలు వ్యక్తుల చాట్ లిస్టులను ఐ డ్రైవ్ బ్యాకప్ ద్వారా పొందే వీలు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులకు పాల్పడటానికి వాట్సాప్ అవకాశం ఇవ్వకూడదని వినియోగదారులు కోరుతున్నారు. అన్ని మెస్సేజ్‌ల రక్షణ కోసం వాట్సాప్ ఉపయోగించే అదే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రమాణాన్ని ఉపయోగించకపోవడం అంటే.. సెక్యూరిటీ కాపీని యాపిల్ డ్రైవ్‌కు ఇవ్వడమేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల గోప్యతను కాపాడటంలో యాపిల్ ఏమాత్రం రాజీ పడదు. ఈ విషయంలో ఆ సంస్థకు మంచి పేరు ఉన్నప్పటికీ, ఐ క్లౌడ్ సెక్యూరిటీపై విమర్శలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి.
ఆ ఫీచర్లపైనా అనుమానాలు
వాట్సాప్ ఇటీవల ప్రారంభించిన ‘disappearing messages’ ఫీచర్‌పైనా మిశ్రమ స్పందన లభించింది. ఈ ఫీచర్ ద్వారా ఆటోమేటిగ్గా కనుమరుగయ్యే (డిసప్పీయరింగ్) మెస్సేజ్‌లు ఎంత సురక్షితంగా ఉంటాయనే అంశంపై టెక్ నిపుణులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలా కనుమరుగైన మెస్సేజ్‌లు ఐ క్లౌడ్ బ్యాకప్‌లో స్టోర్ అవుతాయి. అంటే వినియోగదారుల వద్ద ఉండని వ్యక్తిగత సమాచారం వేరే ప్రదేశంలో స్టోర్ అవుతుంది. అందువల్ల ఈ ఫీచర్‌పై ప్రైవసీ, సెక్యూరిటీ పరంగా విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో పాటు ఇప్పటి వరకు వాట్సాప్ స్క్రీన్షాట్లను నిరోధించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని వల్ల కూడా మెస్సేజ్‌లు, చాట్ లిస్టులను స్క్రీన్షాట్ల ద్వారా ఇతరులు పొందడానికి అవకాశం కలుగుతుంది.
లోపాలను సరిదిద్దాలిసరైన సెక్యూరిటీ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల డిసప్పీయరింగ్ మెస్సేజెస్ ఫీచర్ ఉద్దేశం వినియోగదారులకు ప్రతికూలంగా కనిపిస్తోంది. ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా వాట్సాప్ భద్రతా లోపాలను సమర్థంగా నివారించగలదు. మెస్సేజింగ్ యాప్‌ల విభాగంలో ఈ ఫీచర్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ వినియోగదారుల భద్రత, గోప్యత విషయంలో రాజీ పడేలా ఐ క్లౌడ్ బ్యాకప్ స్టోరేజ్ ఆప్షన్ ఉందని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో విమర్శలపై వాట్సాప్ ఎలా స్పందిస్తుందోనని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లు ఎదురు చూస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 17, 2020, 11:56 AM IST