సాధారణ రోజుల్లోనే తిరుమల (Tirumala) వెళ్లి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక హాలిడేస్ వస్తే తిరుపతి (Tirupati) వెళ్లేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు మళ్లీ వరుసగా సెలవులు వచ్చాయి. ఈ వారం లాంగ్ వీకెండ్ (Long Weekend) వచ్చింది. జనవరి 26 గురువారం రిపబ్లిక్ డే, జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం సందర్భంగా సెలవులు వచ్చాయి. జనవరి 27 లీవ్ తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసి వస్తాయి. కాబట్టి ఈ లాంగ్ వీకెండ్‌లో లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఈ లాంగ్ వీకెండ్‌లో తిరుమల వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. మరి ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం పూర్వ సంధ్య పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతికి టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీలోనే తిరుమలలో శ్రీవారి దర్శనం కూడా కవర్ అవుతుంది. ప్రతీ రోజూ ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
IRCTC Vizag Tour: వచ్చే వారం లాంగ్ వీకెండ్... అరకు , సింహాచలం ట్రిప్ ప్లాన్ చేసుకోండిలా
ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య టూర్ మొదటి రోజు లింగంపల్లిలో ప్రారంభం అవుతుంది. ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో, సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో, రాత్రి 7.38 గంటలకు నల్గొండలో రైలు ఎక్కొచ్చు. రెండో రోజు తెల్లవారుజామున 5:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు.హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు సందర్శించుకోవచ్చు. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
మూడో రోజు ఉదయం 8.30 గంటలకు తిరుమలకు బయల్దేరాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. సాయంత్రం 6.25 గంటలకు తిరుపతిలో రైలు ఎక్కితే నాలుగో రోజు తెల్లవారుజామున 03:04 గంటలకు నల్గొండ, 5:35 గంటలకు సికింద్రాబాద్, 6:55 గంటలకు లింగంపల్లి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Train Ticket: ట్రైన్ టికెట్ పోయిందా? డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు ఇలా
ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య స్టాండర్డ్ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,660, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5860, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.7720 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ధర రూ.7510, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7720, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.9570 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, హోటల్‌లో వసతి, వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆలయాల్లో సాధారణ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC Tourism, Tirumala, Tirupati