E.Santosh, News18, Peddapalli
వ్యవసాయం..! కష్టంతో కూడుకున్నపని.. ఎంత కష్టించినా చివరికి మిగిలేది కష్టాలే. వానొచ్చినా, రాకపోయినా.. నీళ్లున్నా లేకపోయినా నష్టపోయేది మాత్రం రైతే. అన్ని కష్టాలు పడి పంట పండించినా గిట్టుబాటు ధర రాదు. పెట్టిన పెట్టిబడి బూడిదలో పోసిన పన్నీరే. ఐతే అలాంటి కష్టాల నుంచి కొందరు రైతులు బయటపడుతున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నారు. ఏళ్లకేళ్లుగా వరి సాగు చేస్తున్న పెద్దపల్లి జిల్లా రైతులు సాధారణంగానే మెట్ట పంటలైన మిర్చి, పత్తి పంటలు పండించడానికి ఇష్టపడరు. ఇక్కడి వాతావరణం అనుకూలించక నష్టం జరుగుతుందని రైతులు ఎక్కుగా వరి సాగు చేస్తుంటారు. అయితే తెలంగాణ (Telangana)లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli) అంతర్గాం మండలానికి చెందిన రైతు చంద్ర రెడ్డి మాత్రం గత కొన్నేళ్లుగా మిర్చి పంట పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
మిరప పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు చంద్ర రెడ్డి. మిర్చి వ్యవసాయం చేస్తే తప్పకుండా లాభాలు గడించవచ్చని నిరూపించాడు ఈ ఆదర్శ రైతు. రైతు చంద్ర రెడ్డికి మొత్తం 2 ఎకరాల భూమి ఉంది. రెండు ఎకరాల్లో కూడా మిర్చి మాత్రమే సాగు చేస్తున్నాడు. నారు వేయడానికి సెంటుకు 650 గ్రాముల విత్తనాలు, ఎద పెట్టడానికి ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాల్సి వస్తుంది.
అయితే ఈ యేడు మిరపలో అధునిక పద్దతిలో నారు పోశాడు. నారు పెరిగిన తరువాత మొక్కల పాదుల్లో పాలిథిన్ కవర్ వేశాడు. దీంతో మిరప మొక్కకు చీడ.. పీడ బాధలు తగ్గి పంట పెరుగుతుందని వివరించాడు రైతు. ఈ రకంగా ఎకరా మిర్చి పంట సాగుకు సుమారు రూ. 50 వేలు ఖర్చు అవుతుండగా...అదే సమయంలో దిగుబడి 20 - 25 క్వింటాళ్లు వస్తుందని రైతు అంటున్నారు.
పచ్చి మిర్చి తెంపేందుకు ప్రతి రోజు ఐదు నుండి ఆరుగురు కూలీలు పని చేస్తారు. మిరప చెట్లు ఒకసారి కోతకు వచ్చాక చివరి వరకు పది కోతలు వస్తాయని అంటున్నాడు. దీంతో ఇంకా 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు చంద్ర రెడ్డి. గత సంవత్సరం మిర్చి వేయగా ఎకరానికి 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చిందని, ఈసారి వర్షాల వల్ల కొంత తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది కానీ నష్టం ఏమి లేదని అంటున్నాడు రైతు చంద్ర రెడ్డి. వలం మూడు నెలల్లోనే ఖర్చులు పోను ఎకరాకు రెండు లక్షల రూపాయలు మిగిలినట్లు రైతు తెలిపాడు. 9866289928 చంద్ర రెడ్డి, పచ్చి మిర్చి రైతు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Local News, PEDDAPALLI DISTRICT, Telangana