Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
వరిసాగుపై గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగాలం కష్టపడి శ్రమించినా దిగుబడులు వచ్చాక ధాన్యం కొనుగోళ్లు ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సమయానికి కూలీలు దొరకక, కోతల సమయానికి అనుకోని ఉపద్రవాలు ఎదురై.. చేతికందిన పంట నష్టపోయే పరిస్థితితులు ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలనే నాటాలని, వాటినే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అధికారులు చెబుతుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులు ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా వరికి బదులు ఉద్యాన పంటల సాగుతో మెరుగైన ఫలితాలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలం బుర్రవేముల గ్రామానికి చెందిన అయ్యపురెడ్డి శ్రీధర్ అంటున్నారు.
రైతు శ్రీధర్ తన 14 ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో వరి, పత్తి వంటి పంటలను సాగుచేసేవాడు. రానురాను వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో పాటు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ప్రత్యామ్న్యాయ పంటల సాగుపై దృష్టి పెట్టాడు. 14 ఎకరాల భూమిలో కూరగాయల సాగు చేపట్టాడు. కూరగాయల సాగులో మెలకువలు, పందిరి సాగుపై సూక్ష్మ విషయాలను నేర్చుకుని ఆధునిక పద్ధతులు అవలంబించాడు. తాను అనుకున్న దానికంటే మంచి ఫలితాలు రావడంతో కూరగాయల సాగుపై పూర్తి దృష్టిపెట్టాడు రైతు.
ప్రస్తుతం నెలకు రూ. లక్ష వరకు ఆదాయం సంపాదిస్తూ పులువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో కొద్దిపాటి భూమిలో మాత్రమే కూరగాయలు సాగు చేపట్టిన రైతు శ్రీధర్ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో 14 ఎకరాలలో కూరగాయలను సాగు చేస్తు న్నాడు. బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, గొడు చిక్కుడు, ఆగాకారకాయలు, వంకాయ, చిక్కుడు, టామాటో, మిర్చి, వంటి కూరగాయలు సాగుచేస్తు లాభాలు గడిస్తున్నాడు.
ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు
14 ఎకరాల్లో పెట్టుబడికి గానూ దాదాపు రూ. 10 లక్షల ఖర్చు అయ్యిందని అందులో రూ.3.80 లక్షలు డ్రిప్ సిస్టం ఏర్పాటుకు, మరో రూ.5.25 లక్షలు పందిళ్లు వేయడానికి ఖర్చు చేసినట్లు రైతు వివరించాడు. 14 ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేందుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇందుకుగాను తన వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో మోటార్లు ఏర్పాటు చేయాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో డ్రిప్ సిస్టం వైపు ఆలోచన చేసి సెకండ్ హ్యాండ్ డ్రిప్ సిస్టం, పైపులను రూ.3.80 లక్షలు పెట్టి కోనుగోలు చేశాడు. 14 ఎకరాల్లో పైప్ లైన్ ఏర్పాటు చేశాడు.
బావిలో కావాల్సినంత నీరు ఉండటంతో ఎండకాలంలో కూడా కూరగాయల సాగుకు ఇబ్బంది లేకుండా నడిపించాడు. పూర్తి స్థాయిలో కూరగాయాల సాగుపై దృష్టిపెట్టిన నేపథ్యంలో చింతూరు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా వెదురు బొంగులు తెప్పించి విజయవాడ నుంచి వచ్చిన కూలీలచే ప్రత్యేకంగా కూరగాయల సాగుకు పందిరిలను ఏర్పాటు చేయించాడు. దీనికి గాను సుమారు రూ.5.25 లక్షల వరకు ఖర్చు చేశాడు.
నేరుగా అమ్మకంతో లాభాలు
పండించిన పంటలను లక్ష్మీనగరం, భద్రాచలం, చర్ల, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాలలోని సంతలకు వ్యాపారులు కొనుక్కుని వెళ్తున్నారు. దాంతో పాటు తన ఇంటి దగ్గరే దుకాణం ఏర్పాటు చేసి కూరగాయాలను విక్రయిస్తున్నాడు రైతు. ఒకసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెలా ఆదాయం సంపాదిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Farmer, Local News, Telangana