పుత్తడి అంటే అతివలకు ప్రత్యేకించి భారతీయ మహిళలకు ఎంతో ప్రీతి. భారతదేశంలో వివాహాలకు, పండుగలకు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ధోరణి భారతీయ సంస్కృతికి చిహ్నంగా అనాదిగా కొనసాగుతుంది. అంతేకాక, బంగారాన్ని కేవలం అలంకరణ కోసమే కాకుండా సురక్షిత పెట్టుబడి మార్గంగా కూడా భావిస్తారు భారతీయులు. స్వచ్ఛత, విలువ, రాయల్టీ విషయాల్లో ఏ ఇతర ఆభరణం కూడా బంగారానికి సాటిరాదు. అందువల్లే, 2010 నుండి బంగారం(Gold) ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో రేటులో సుమారు 900% వృద్ధి నమోదైంది అంటే మార్కెట్లో బంగారానికి ఉన్న క్రేజ్ ఏమిటో చెప్పవచ్చు. గత పదేళ్లలో బంగారం ధరల్లో ఎన్నో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. అయితే, అంతిమంగా ఏటా దీని వాల్యూ పెరుగుతూ వస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ఇది, ఇతర వస్తువుల మాదిరిగా కాకుండా, పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ గణనీయమైన రాబడిని అందిస్తుంది.
పెట్టుబడిదారుల మొదటి ఛాయిస్‌గా బంగారం ఎప్పుడూ ముందుంటుంది. ఇది స్థిర డిపాజిట్లు(fFixed Deposits), స్టాక్ మార్కెట్లు (Stock Markets) లేదా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) మొదలైన వాటి కంటే మెరుగైన రాబడిని అందిస్తుంది. కరోనా సంక్షోభం, మార్కెట్ పరిస్థితుల కారణంగా గత కొద్ది నెలలుగా, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. COVID-–19 లాక్డౌన్(Lockdown) కారణంగా మార్చి నెల నుంచి బంగారం ధరలు అమాంత పెరుగుతున్నాయి. 2020 జూలైలో బంగారం ధర మొదటిసారి రూ.50,000 మార్కును తాకింది.
భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం
గత కొద్ది సంవత్సరాలుగా బంగారు మైనింగ్ (Mining) తగ్గుతూ వస్తోంది. మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ధర భవిష్యత్ డిమాండ్, సరఫరాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వర్తకం చేసే ఇతర వస్తువుల మాదిరిగానే, బంగారం డిమాండ్, సరఫరా దాని ధరను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తద్వారా, బంగారం డిమాండ్ పెరిగితే, ధర కూడా పెరుగుతుంది.
ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు
మార్కెట్లో ద్రవ్యోల్బణం(Inflation) పెరిగినప్పుడు, డబ్బు విలువ పడిపోతుంది. దీంతో, ఇతర పెట్టుబడి మార్గాలు రాబడిని ఇవ్వడంలో విఫలమవుతాయి. అందువల్ల, ఎక్కువ మంది ప్రజలు బంగారంపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. కరెన్సీ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తారు. దీనితో పాటు బ్యాంకులు అమలు చేస్తున్న వడ్డీ రేట్టు(Interest Rate) కూడా బంగారం ధరను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. బంగారం ధరపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందిద. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, ప్రజలు తమ డిపాజిట్లపై మంచి రాబడిని పొందలేదు. అందువల్ల, వారు తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకొని, ఆ డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇది డిమాండ్ పెరుగుదలకు దారితీస్తుంది.
కరెన్సీ హెచ్చుతగ్గులు
అంతర్జాతీయ మార్కెట్లలో, బంగారం యూఎస్ డాలర్లలోనే వర్తకం చేయబడుతుంది. అదే బంగారం భారతదేశం దిగుమతి చేసుకుంటే అది USD నుంచి INR గా మార్చబడుతుంది. అందువల్ల, USD లేదా INRలో ఏదైనా హెచ్చుతగ్గులు (Fluctuation) బంగారం దిగుమతి ధరను ప్రభావితం చేస్తాయి. ఇటీవల యునైటెడ్ స్టేట్స్(United States) ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో అనేక దేశాల కంటే డాలర్ విలువ కొంతమేర బలహీనపడింది. కాబట్టి, గత కొంత కాలంగా బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి.
సెంట్రల్ బ్యాంక్‌లు బంగారు నిల్వలను పెంచడం
డాలర్ విలువ తగ్గుతుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI))తో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి, బంగారం ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
బలహీనమైన మార్కెట్ పరిస్థితులు
బంగారం అనేది స్టాక్స్(Stocks), బాండ్లు(Bonds), రియల్ ఎస్టేట్ల(Real Estate)తో ప్రతికూలంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ఆర్థిక లేదా ఆర్థికేతర సంక్షోభ తలెత్తిన సమయంలో, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. బంగారం దేశీయ ధరలు సహజంగా ప్రపంచ బంగారం ధర, ఎక్స్‌చ్చేంజ్ రేటు, ట్రాన్సాక్షన్ వ్యయం, దిగుమతి సుంకాలు, కొన్ని మధ్యవర్తిత్వ అంశాలకు అనుగుణంగా నిర్ణయించబడుతుంది.
పండుగలు, వివాహాల సీజన్
భారతీయ మతపరమైన సాంప్రదాయ పండుగలు, వివాహాలలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే, పండుగలు, వివాహ సీజన్లలో, బంగారం డిమాండ్(Demand) అమాంతం పెరుగుతుంది, డిమాండ్ పెరగడంతో జ్యువలరీ షాపు యజమానులు బంగారం ధరను కూడా పెంచుతారు.