గృహ రుణాలు ఇటీవల కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీలకే గృహ రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే ఈ రుణాలు ఎక్కువగా దీర్ఘకాల పరిమితిని కలిగి ఉంటాయి. కొన్ని రకాల హోమ్ లోన్లకు 10, 20, 30 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్నవారు, దాన్ని పూర్తిగా తిరిగి చెల్లించకుండా, మధ్యలోనే మరణిస్తే ఏమవుతుంది? ఈఎంఐల రూపంలో వారు చెల్లించిన మొత్తం మరణం తర్వాత లెక్కించరా? ఉమ్మడిగా యాజమాన్యపు హక్కు ఉన్న వారు ఆస్తి హక్కును కోల్పోతారా? లాంటి ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. అయితే ఇవన్ని అపోహలే.
హోంలోన్‌ల విషయంలో చాలా మందిలో ఉండే ప్రధాన అపోహ.. బ్యాంకులు ప్రాపర్టీని స్వాధీనపరుచుకుంటాయని భావించడం. సినిమాల్లో చూపించినట్లు ఏ బ్యాంకు కూడా ఎప్పుడూ మీ ఆస్తిని స్వాధీనపరచుకోవడానికి ఇష్టపడదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వారిచ్చిన రుణాలపై వచ్చే వడ్డీని లాభంగా పొందాలని చూస్తాయి. అందుకే రుణగ్రస్తుడు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనే ముందుగానే ఆలోచిస్తాయి. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లోనూ ఈ విషయమే ఉంటుంది. చాలా వరకు బ్యాంకులు మీరు లోన్ తిరిగి చెల్లించేలానే అనుకుంటాయి. ఆస్తిని స్వాధీనపరచుకోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.
వేలం వేయడం ద్వారా ఆస్తిని విక్రయించడం వల్ల నష్టాలను పూరించలేవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు విజయ్ మాల్యా, సుబ్రోతో రాయ్ సహారా సంఘటనలే ప్రధానమైనవి. ఆస్తులు వేలం వేయడం, స్వాధీనపరచుకోవడం బ్యాంకులకు పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎలాంటి ఆప్షన్లు లేని సమయాల్లో మాత్రమే ఈ ఈ విధానాన్ని ఎంచుకుంటాయి.
ఆస్తి బీమా ద్వారా ఉపశమనం పొందవచ్చు..
లోన్ నుంచి రక్షణ పొందాలంటే హోం లోన్ ఇన్సురెన్స్, ప్రాపర్టీ ఇన్సురెన్స్ అని రెండు రకాల బీమాలు ఉంటాయి. ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇవి మీకు రక్షణ కల్పిస్తాయి. కాలపరిమితి మధ్యలోనే రుణగ్రస్తుడు చనిపోయినట్లయితే హోం లోన్ ఇన్సురెన్స్ ఉపయోగపడుతుంది. ప్రాపర్టీ ఇన్సురెన్స్ వల్ల ఇతర ప్రయోజనాలున్నాయి.
ఎలాంటి సందర్భంలో హోంలోన్ ఇన్సురెన్స్ పనికిరాదు..
రుణం తిరిగి చెల్లించే కాలపరిమితి లోపు మరణం సంభవించినప్పుడు హోంలోన్ పాలసీలు కచ్చితంగా అత్యుత్తమంగా ఉపయోగపడతాయి. అయితే సహజ మరణం లేదా ఆత్మ హత్య విషయంలో ఈ బీమా ద్వారా క్లెయిమ్ చేసుకోలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
హోంలోన్ ఇన్సురెన్స్ తీసుకుంటే..
రుణగ్రహీత రుణం తీసుకునేటప్పుడే హోం లోన్ ఇన్సురెన్స్ కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లించినట్లయితే బీమా సంస్థ మిగిలిన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తుంది. ఫలితంగా ప్రాపర్టీకి బ్యాంకుల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే బీమా కవర్ అనేది లోన్ రీపేమెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రుణగ్రహీత రూ.50 లక్షల రుణంలో రూ.30 లక్షలు చెల్లించి మరణిస్తే.. మిగిలిన రూ.20 లక్షలు బీమా సంస్థ బ్యాంకుకు చెల్లిస్తుంది. ఇది ఉమ్మడిగా తీసుకునే లోన్లకు వర్తించదు. అంటే రుణగ్రస్తుడు తన భార్యతో కలిసి సంయుక్తంగా హోంలోన్ తీసుకుంటే అతడు మరణించిన తర్వాత రుణాన్ని తిరిగి చెల్లించే మొత్తం బాధ్యత ఆమెకు మారుతుంది.
హోంలోన్ ఇన్సురెన్స్ లేకపోతే..
ఒకవేళ రుణగ్రస్తుడు ఇన్సురెన్స్ తీసుకోకపోతే.. రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత సహ రుణగ్రస్తుడు లేదా చట్టబద్ధమైన వారసుడిపై ఉంటుంది. కావాలనుకుంటే వారసులు రుణం మొత్తాన్ని ఏకకాలంలో కూడా చెల్లించే అవకాశముంటుంది. అంతేకాకుండా ఆ రుణ బదిలీ అనేది అప్పటివరకు అందుబాటులో ఉన్న నియమ, నిబంధనలు, షరతుల ఆధారంగా అందిస్తారు.
వారసుడు రుణాన్ని చెల్లించకపోతే..
రుణాన్ని తిరిగి చెల్లించడంలో వారసడుు తన అసమర్థతను తెలియజేస్తే నష్టాలను తిరిగి భర్తీ చేయడానికి ఆస్తిని బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి బ్యాంకు స్వాధీనపరచుకుంటుంది. లోన్ కంటే ఆస్తి విలువ ఎక్కువయితే.. రుణానికి సరిపడిన మొత్తం పోగా.. మిగిలిన సొమ్మును వారసుడికి ఇస్తారు. విక్రయించినప్పుడు సొమ్ము రుణం మొత్తం కంటే తక్కువ ఉంటే ఆ అంతరాన్ని పూరించడానికి చట్టపరమైన వారసుడే బాధ్యత వహిస్తాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Home loan, House loan, Housing Loans