టూ-వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ (Helmet) ధరించడం ఎంత ముఖ్యమో అందరికి తెలిసిన విషయమే. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఇప్పటికీ ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టూవీలర్ పై హెల్మెట్లు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చాలాన్లు వేసినా ఫలితం మాత్రం పెద్దగా కనిపిండం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు తమ రూటు మార్చారు. ఎంత చెబుతున్నా తమ మాటలు పెడచెవిన పెడుతున్న కొందరు వాహనదారులు తిక్క కుదర్చడానికి రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు హెల్మెట్ పెట్టుకోకపోతే చలాన్లతో సరిపెట్టిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు కాస్త తమ ట్రీట్మెంట్ మార్చారు. హెల్మెట్ లేకుండా బయటకు వస్తే బండిలో పెట్రోల్ పోయొద్దని ఆదేశాలు ఇచ్చారు వరంగల్ సిటీ పోలీసులు (Warangal City Police). వరంగల్ సిటీలో ఆగస్ట్ 15 నుంచి హెల్మెట్ ధరించకుండా ఎవరైన పెట్రోల్ బంకు వస్తే వారికి పెట్రోల్ పోయొద్దని పెట్రోల్ పంప్ ఓనర్లు, పంప్ అటెండెంట్‌లకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే సిటీలో చాలా సార్లు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా పెద్దగా ఫలితం లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాల్లో మరణిస్తున్నందున, ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఇప్పటికే 'నో హెల్మెట్, నో పెట్రోల్' అనే ఫ్లెక్సీలు, బ్యానర్‌లను ఏర్పాటు చేశారు.
ఆగస్టు 15 నుంచి వరంగల్ వ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో హెల్మెట్ లేనిదే పెట్రోల్ పోయరు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 426 మంది మరణించగా దాదాపు 1,110 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదాలన్నీ హెల్మెట్ ధరించకపోవడం వల్లనే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు మరణించారని తరుణ్ జోషీ వెల్లడించారు. ఐఓసీ, హెచ్‌పీ, బీపీసీఎల్ తదితర పెట్రోల్ బంకులకు ఇప్పటికే 150 బ్యానర్లు పంపిణీ చేశామని ట్రాఫిక్ ఏసీపీ మధుస్ధన్ తెలిపారు.
నవంబర్ 1, 2021 నుండి పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ధరించాలనే నిబంధనను పోలీసులు ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయినా.. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ నిబంధన అమల్లోకి తీసుకువచ్చామని అంటున్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Helmet, Petrol pump, Telangana Police, Warangal