Layoffs: ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు లేఆఫ్స్‌కు తెరలేపాయి. అలాగే ఖర్చులు తగ్గించే మార్గాలను టెక్ కంపెనీలు(Tech companies) అన్వేషిస్తున్నాయి. గతేడాది మొదలైన ఉద్యోగుల తొలగింపుల పర్వం.. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్(Layoffs) వివరాలు ట్రాక్ చేసే layoffs.fyi పోర్టల్ వెల్లడించిన తాజా డేటాలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. లేఆఫ్స్ కారణంగా గతేడాది ఉద్యోగాలు కోల్పోయిన వారితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలలలోనే ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
2022లో ప్రపంచవ్యాప్తంగా 1,61,411 మంది ఉద్యోగులు లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మార్చి 23 వరకు 1,71,858 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే గతేడాదికి మించి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 518 టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రక్రియను చేపట్టాయి. ఈ జాబితాలో గూగుల్ , మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ , యాక్సెంచర్ వంటి గ్లోబల్ ఐటీ కంపెనీలు ఉండడం గమనార్హం.
* యాక్సెంచర్‌లో 19,000 ఉద్యోగుల తొలగింపు
layoffs.fyi తాజా డేటా ప్రకారం.. 2023 ప్రారంభం నుంచి మార్చి 23 వరకు మొత్తం 517 టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1,52,858(యాక్సెంచర్ మినహా) మంది ఉద్యోగులను తొలగించాయి. యాక్సెంచర్ తాజాగా 19,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ డేటాను కూడా కలుపుకుంటే మొత్తం ఉద్యోగుల తొలగింపు సంఖ్య 1,71,858కు చేరింది. కాగా, 2022లో మొత్తంగా 1,052 టెక్ కంపెనీలు 1,61,411 మంది ఉద్యోగులను తొలగించాయి.
2023 మార్చి త్రైమాసికం (Q1) కరోనా తర్వాత అత్యధిక సంఖ్యలో తొలగింపులను నమోదు చేసింది. 522 కంపెనీలు 1,52,858 మందిని తొలగించాయి. యాక్సెంచర్ మొదటి త్రైమాసికం మార్చి 31తో ముగుస్తుంది. దీంతో ఈ సంస్థ లేఆఫ్స్(19,000)ను జత చేస్తే ఈ సంఖ్య 1,71,858కు చేరుతుంది.
* నెలవారీగా తొలగింపులు
ఈ ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడుస్తోంది. ఈ మూడు నెలల్లో రికార్డ్ లేఆఫ్స్ జనవరిలో నమోదయ్యాయి. దాదాపు 270 కంపెనీలు ఏకంగా 84,74 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రక్రియ ఫిబ్రవరిలో కాస్త నెమ్మదించింది. ఆ నెలలో 173 కంపెనీలు 36,541 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇక మార్చి నెలలో 23వ తేదీ వరకు 79 కంపెనీలు 31,603 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Pay Per Road Use: కొత్త టోల్ పాలసీ..రోడ్డుపై ఎంత దూరం ప్రయాణిస్తే ఆ మేరకు టోల్ కట్టాలంట!
* రంగాల వారీగా లేఆఫ్స్
2023 ఏడాదికి సంబంధించి రంగాల వారీగా తొలగింపుల డేటా layoffs.fyi లో అందుబాటులో లేదు. గతేడాది రిటైల్ రంగంలో అత్యధికంగా 20,914 మంది ఉద్యోగులను తొలగించారు. తర్వాత స్థానంలో వినియోగదారుల రంగం (19,856), రవాణా రంగం (15,977), హెల్త్‌కేర్ (15,058), ఫైనాన్స్ (12,899), ఫుడ్ (11,288), రియల్ ఎస్టేట్ (9,932), ఎడ్యుకేషన్ (8,728) నిలిచాయి.
* కంపెనీల వారీగా తొలగింపులు
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లేఆఫ్స్‌లో అమెజాన్ టాప్ ప్లేస్‌లో ఉంది. మూడు విడతల్లో 27,000 మందిని తొలగించింది. తరువాతి స్థానంలో మెటా నిలిచింది. ఇది రెండు విడతల్లో 21,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తరువాత స్థానాల్లో వరుసగా యాక్సెంచర్(19,000), గూగుల్ (12,000), మైక్రోసాఫ్ట్ (10,000), ఎరిక్సన్ (8,500), సేల్స్‌ఫోర్స్ (8,000), డెల్ (6,650), ఫిలిప్స్ (6,000) నిలిచాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.