టాటా సఫారీని మళ్లీ మార్కెట్లోకి తెస్తున్నట్టు టాటా కంపెనీ చేసిన ప్రకటన ఎంతోమందిలో సంతోషం నింపింది. గత సంవత్సరం సఫారీ కార్లను నిలిపివేసిన కంపెనీ తాజాగా దీని అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేసేందుకు రెడీ అయింది. గ్రావిటాస్ పేరుతో ఉన్న కార్లను సరికొత్త టాటా సఫారీ కార్ల పేరుతో మళ్లీ అందుబాటులోకి తెచ్చి, తన కస్టమర్లను సంతోషంలో ముంచెత్తేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ టాటా చేసిన ప్రకటన క్షణాల్లో వైరల్ అయిందంటే సఫారీకి ఉన్న ఆదరణ ఎలాంటిదో ఇట్టే చెబుతుంది. ఆటో ఎక్స్ పోలో ఇప్పటికే దీన్ని ప్రదర్శించారు కూడా. మరికొన్ని రోజుల్లో షోరూముల్లో సందడి చేయనున్న సఫారీలు జనవరి 26 నుంచి రోడ్లపై పరుగులు తీయనున్నాయి. గ్రావిటాస్ 7 సీటర్ కు టాటా సఫారీగా పేరు మార్చగా హ్యారియర్ బేస్డ్ ఎస్ యూవీ మార్కెట్లో ట్రెండింగ్ గా ఉంది. టాటా ఫ్లాగ్ షిప్ SUVగా టాటా సఫారీ 2021 హాట్ కేక్ గా మారనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సఫారీ బుకింగ్స్ జోరందుకున్నాయి. 1998లో మొట్టమొదటి సారి మన మార్కెట్లో లాంచ్ అయిన సఫారీ మనవాళ్లకు అసలు సిసలు SUV అంటే ఏంటో రుచి చూపింది.
6 సీటర్, 7 సీటర్..
ఆటోమొబైల్ లవర్స్ కు టాటా సఫారీ అంటే అమితమైన ప్రేమ అని ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. కొత్త సఫారీలో 6 సీటర్, 7 సీటర్ అనే రెండు వర్షన్స్ ఉన్నాయి. 7 సీటర్ వర్షన్ లో బెంచ్ టైప్ సీట్ విత్ అడ్జస్టబుల్ హెడ్రెస్ట్స్ ఉంటాయి. హ్యారియర్ కు ఎక్స్టెండెడ్ వర్షన్ అయిన సఫారీని ముందు నుంచి చూడగానే Harrier SUV లానే కనిపిస్తుంది. కొత్త సఫారీ లుక్ లో భాగంగా హ్యారియర్ బంపర్ డిజైన్ లో చిన్నపాటి మార్పు మాత్రం చేశారు అంతే. కానీ రూఫ్ లైన్, లోపలి స్పేస్ విషయానికి వస్తే చాలా మార్పులు చేశారు. దీని హైట్ కూడా పెంచారు. వెనకల భాగంలో టెయిల్ ల్యాంప్స్ సరికొత్త లుక్ ను సంతరించుకున్నాయి. హ్యారియర్ కంటే సఫారీ పొడవు 63mmఎక్కువగా, ఎత్తు 80mm ఎక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. చూడగానే హ్యారియర్ లా కనిపించకుండా Safari కొత్త రంగుల్లో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ఇంజిన్ ఇలా ఉంటుంది..
Harrier 2,741mm వీల్ బేస్ నే టాటా సఫారీలోనూ పొందుపరిచారు. ఇనిషియలీ ఇది టూ వీల్ డ్రైవ్ గా లాంచ్ అవుతుండగా త్వరలో ఫోర్ వీల్, ఎలక్ట్రిక్ వర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే హ్యారియర్ లో ఉన్న 2.0 లీటర్ క్రైటెక్ డీజిల్ ఇంజిన్ ను సఫారీలోనూ కొనసాగిస్తున్నారు. 170bhp పవర్ తో పాటు 350Nm టార్క ను ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం ఉన్న ఇంజిన్ కావటం విశేషం.
కళ్లు చెదిరే ఇంటీరియర్స్
హ్యారియర్ లో ఉన్న డ్యాష్ బోర్డ్ డిజైన్, ఇంటీరియర్స్ సఫారీలోనూ కొనసాగిస్తున్నారు. ఎలెక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్స్ సీట్, 8.8 ఇంచిల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కీలెస్ ఎంట్రీ, సన్ ప్రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ కూడా దీనికి ఉండటం మరో హైలైట్.
న్యూ సఫారీ ధర ఎంతంటే ?
Harrier కంటే కాస్త ఎక్కువ ధరలో టాటా సఫారీ 2021లభిస్తుంది. టాటా సఫారీ ధరలు 15 లక్షల నుంచి 21 లక్షల మధ్య ఉండనున్నాయి. ఇక హ్యారియర్ ధరలు 13.48 లక్షల నుంచి 20.30 లక్షల మధ్య ఉన్నాయి. కాంపిటీషన్ విషయానికి వస్తే MG Hector Plus, Mahindra XUV500 తో సఫారీకి పోటీ నెలకొంది. భవిష్యత్ లో అయితే ఈ ఏడాది చివరికల్లా లాంచ్ కానున్న Hyundai's 7 seater Creta ప్రధాన పోటీగా ఉంటుంది. C-SUV సెగ్మంట్లోకి Ford కూడా వచ్చే అవకాశాలుండటంతో మన మార్కెట్లో ఎస్ యూవీల మధ్య మరింత పోటీ రాజేయటం ఖాయం.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.