TATA LAUNCHES CRETA RIVAL SUV GASOLINE ENGINE MK GH
Tata Motors: త్వరలోనే టాటా నుంచి బ్లాక్‌బర్డ్ మిడ్ రేంజ్ ఎస్యూవీ లాంచ్.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలోనూ లభ్యం
ప్రతీకాత్మకచిత్రం
టాటా మోటార్స్ 2021 డిసెంబర్ నాటికి రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ కేవలం ఒక నెలలోనే 12,000 కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది.
టాటా మోటార్స్ 2021 డిసెంబర్ నాటికి రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ కేవలం ఒక నెలలోనే 12,000 కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఇక, టాటా గత 1-2 సంవత్సరాలుగా నెలకు దాదాపు 30,000 కార్లను విక్రయిస్తూ రికార్డు సృష్టించింది. దీంతో అమ్మకాల్లో కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఈ ఉత్సాహంతోనే త్వరలోనే బ్లాక్ బర్డ్ అనే కోడ్ నేమ్‌తో మిడ్‌రేంజ్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని యోచిస్తోంది. ఈ బ్లాక్‌బర్డ్ ఎస్యూవీ లాంచింగ్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.
ఇటీవల మార్కెట్లోకి విడుదలైన టాటా పంచ్, నెక్సాన్‌లకు వస్తోన్న అధిక స్పందనతో మిడ్‌రేంజ్ ఎస్యూవీ విభాగంలోకి అడుగు పెట్టడానికి ఇది సమయంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలతో పాటు ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన మిడ్‌రేంజ్ ఎస్యూవీ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బ్లాక్‌బర్డ్ మిడ్‌రేంజ్ ఎస్యూవీ వాహనాన్ని టాటా నెక్సాన్ మాదిరిగానే X1 ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించాలని కంపెనీ భావిస్తోంది. ఈ మిడ్‌రేంజ్ ఎస్యూవీ కారు పరిమాణం దాదాపు 4.3 మీటర్లుగా ఉండనుంది. ఈ కారును పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో విడుదల చేయాలని యోచిస్తోంది. పెట్రోల్ వేరియంట్లో 1.5 -లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనుంది. సీఎన్జీ వేరియంట్లో 4- సిలిండర్ ఇంజిన్లను చేర్చనుంది. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగున్న దృష్ట్యా దీన్ని ఎలక్ట్రిక్ వెర్షన్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. వీటి ఉత్పత్తి 2023 నాటికి ప్రారంభం కానుందని ఆటో మొబైల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
కాగా, 1.5- లీటర్ టర్బోతో కూడిన గ్యాసోలిన్ ఇంజన్ దాదాపు 160 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నారు. ఈ మిడ్‌రేంజ్ ఎస్యూవీ లాంచింగ్‌పై టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ బిజినెస్ ప్రెసిడెంట్ షీలేష్ చంద్ర మాట్లాడుతూ “టాటా మోటార్స్ దాదాపు 4.3 మీటర్ల పొడవు గల కొత్త మధ్య తరహా ఎస్యూవీ వాహనంపై పనిచేస్తుంది. ఈ కొత్త ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వీడబ్ల్యూ టైగన్, స్కోడాక్ షాక్, ఎంజీ ఆస్టర్ వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.” అని తెలిపారు. అయితే ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.