news18-telugu
Updated: November 11, 2020, 6:54 PM IST
Tata Harrier Camo: టాటా హారియర్ కామో (Image Source: Tata)
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన హారియర్ సిరీస్‌లో సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. ఎస్యూవీ విభాగంలోని హారియర్ సిరీస్‌కు చెందిన కామో స్పెషల్ ఎడిషన్ వెహికిల్‌ను అట్రాక్టివ్ ఫీచర్స్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఈ పండుగ సీజన్లో భాగంగా దీని ప్రారంభ ధరను రూ .16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఈ నూతన కామో స్పెషల్ ఎడిషన్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. XT వేరియంట్ నుంచి మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో, XZ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కామో స్పెషల్ ఎడిషన్ వెహికిల్ అందుబాటులోకి తెచ్చింది టాటా మోటార్స్. అందేకాక, నూతన కామో స్పెషల్ ఎడిషన్‌కు అట్రాక్టివ్ ఫీచర్లను జోడించింది. దీనిలో భాగంగా కారు వెలుపల స్పెషల్ కామో గ్రాఫిక్స్, బోనెట్‌పై హారియర్ మస్కట్, రూఫ్ రెయిల్స్, సైడ్ స్టెప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి వాటిని అమర్చింది. అదేవిధంగా, కారు లోపలి భాగంలో బ్యాక్ సీట్ ఆర్గనైజర్, OMEGARC స్కఫ్ ప్లేట్స్, సన్ షేడ్స్, డిజైనర్ 3డి మోల్డ్ మాట్స్, 3డి ట్రంక్ మాట్స్, యాంటీ స్కిడ్ డాష్ మాట్స్ను పొందుపర్చింది.
టాటా మోటార్స్‌కు మార్కెట్లో పెరిగిన డిమాండ్ఆటోమొబైల్ పరిశ్రమపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా మోటార్స్ నికర నష్టం రూ.307 కోట్లకు పెరిగింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం జూలై-, సెప్టెంబర్ మధ్య కాలంలో టాటా మోటార్స్ రూ.187.7 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అందువల్ల, రాబోయే నెలల్లో డిమాండ్ పెంచుకొని నష్టాల నుంచి గట్టెక్కి లాభాల బాట పట్టాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగా రాబోయే నెలల్లో డిమాండ్, సరఫరా క్రమంగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. టాటా మోటార్స్ ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇదే ధోరణి మరో మూడు నెలల పాటు కొనసాగితే కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్‌కు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమవుతాయని టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి బాలాజీ పేర్కొన్నారు. కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,212.45 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే కాలంలో రూ.1,281.97 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2019–20 సెప్టెంబర్ త్రైమాసికంలో తమ మొత్తం కార్యకలాపాల ద్వారా రూ .10,000.48 కోట్ల ఆదాయాన్ని గడిస్తే, అదే, ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో తమ మొత్తం కార్యకలాపాల ద్వారా రూ .9,668.10 కోట్ల ఆదాయం సమకూరినట్లు టాటా మోటార్స్ పేర్కొంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 6, 2020, 6:01 PM IST