• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • TATA BUSINESS HUB ARE YOU A SMALL BUSINESSMAN BUT WORK WITH TATA MK GH

Tata Business Hub: మీరు చిరు వ్యాపారస్తులా...అయితే టాటాతో కలిసి పని చేయండి...

Tata Business Hub: మీరు చిరు వ్యాపారస్తులా...అయితే టాటాతో కలిసి పని చేయండి...

ప్రతీకాత్మకచిత్రం

టాటా సన్స్ భారతదేశంలో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఆ సంస్థ చిన్న, మధ్యతరహా సంస్థల (SMEs) కోసం సరికొత్త మార్కెట్ ప్లేస్‌ను నిర్మిస్తోంది.

  • Share this:
టాటా సన్స్ భారతదేశంలో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఆ సంస్థ చిన్న, మధ్యతరహా సంస్థల (SMEs) కోసం సరికొత్త మార్కెట్ ప్లేస్‌ను నిర్మిస్తోంది. దీనికి టాటా బిజినెస్ హబ్ అనే పేరు పెట్టారు. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా, గూగుల్, జోహో వంటి ఇంటర్నెట్ కంపెనీలు అనుసరించే వ్యాపార నమూనాలను టాటా సన్స్ కొత్త బిజినెస్‌ కోసం వాడనుంది. ఇలాంటి సంస్థలు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి డిజిటల్ టూల్స్, సొల్యూషన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. టాటా బిజినెస్ హబ్‌ విభాగానికి TCS ప్రతినిధి వెంగుస్వామి రామస్వామి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చిన్న, మధ్య తరహా సంస్థలకు క్లౌడ్ బేస్డ్ IT సొల్యూషన్స్ అందించే TCS iONకు గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు.

SMEల మార్కెటింగ్, కస్టమర్ సేవల కోసం TCS అభివృద్ధి చేసిన డిజిటల్ టూల్స్‌ను టాటా బిజినెస్ హబ్ ఫ్లాట్‌ఫాం వినియోగించనుంది. చిన్న, మధ్య తరహా సంస్థలు తమ వ్యాపారం కోసం నిధులను సేకరించడానికి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి కూడా ఈ విభాగం సహాయం చేయనుంది. ప్రస్తుతం అనేక చిన్న కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి టెక్నాలజీ, సరైన మార్కెట్ ప్లేస్‌లను యాక్సెస్ చేసుకోలేకపోతున్నాయి. ఇలాంటి వాటి కోసం టాటా బిజినెస్ హబ్ ప్రత్యేకంగా సేవలు అందించనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

నిపుణుల బృందం సలహాలు
కొత్త వ్యాపారం కోసం టాటా బిజినెస్ హబ్ ఇంతకు ముందు ఇండియా మార్ట్‌తో ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ అది తుదిరూపు దాల్చలేదు. దీంతో సొంతంగా ప్లాట్‌ఫాంను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. చిన్నతరహా పరిశ్రమలు స్థాపించిన వారు తమ వ్యాపారంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, వారికి సలహాలు ఇస్తూ మార్గనిర్దేశం చేయడానికి ఈ సంస్థ ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రముఖులను టాటా బిజినెస్ హబ్ నియమించుకుంది. ఈ ప్లాట్‌ఫాం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా సంస్థలను లిస్టింగ్ చేసుకుంటూ, ఉచితంగా సేవలు అందించడం ప్రారంభించిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై టాటా సన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఉచిత సేవలు కూడా
ఇన్వాయిస్‌లు జెనరేట్ చేయటానికి, బిల్లుల కలెక్షన్లకు, వీడియో కాన్ఫరెన్సుల కోసం ఈ ప్లాట్‌ఫాంలో టూల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక సదుపాయాలను TCS అభివృద్ధి చేస్తోంది. ఈ టూల్స్‌లో కొన్ని ఫ్రీమియం ఆప్షన్లు (freemium option) కూడా ఉన్నాయి. దీని ద్వారా కస్టమర్ కంపెనీలు పరిమిత సేవలను ఉచితంగా పొందవచ్చు. అదనపు ఫీచర్ల కోసం కొంత డబ్బు చెల్లించి ప్రీమియం విభాగానికి మారాల్సి ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇలాంటి మార్గాలను అనుసరిస్తున్నాయి.
First published: