కోవిడ్ చికిత్సకు డబ్బులు కావాలా... రూ.15 లక్షల కవరేజీ అందిస్తున్న సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌..ప్రీమియం ధరలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

సూపర్ టాప్ అప్ ప్లాన్లు రూ.15 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తాయి. ఈ విభాగంలో మనకు అందుబాటులో ఉన్న ప్లాన్ల ధరలను లబ్ధిదారులు పోల్చి చూడాలి. ప్రీమియం ధరల ఆధారంగా వీటిని ఎంచుకోవాలి.

  • Share this:
కోవిడ్-19 తరువాత హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వ్యక్తులు వైద్యం కోసం కేటాయించాల్సిన నిధులను హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మిగుల్చుకోవచ్చు. ఇందుకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తించే సభ్యులందరి వైద్య ఖర్చులను పాలసీ భరిస్తుంది. కుటుంబ ఆర్థిక భద్రతను ఇలాంటి పాలసీలు కాపాడతాయి. ప్రతి కుంటుంబం హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. వీటిని ఎంచుకునే ముందు కుటుంబం మొత్తానికి సంబంధించిన వైద్య అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇన్సూరెన్స్ కవరేజీ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల కంటే తక్కువగా ఉండకూడదు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో ఉండేవారు ఎక్కువ కవరేజీ ఉండే పాలసీలను ఎంచుకోవాలి. సూపర్ టాప్ అప్ ప్లాన్లు రూ.15 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తాయి. ఈ విభాగంలో మనకు అందుబాటులో ఉన్న ప్లాన్ల ధరలను లబ్ధిదారులు పోల్చి చూడాలి. ప్రీమియం ధరల ఆధారంగా వీటిని ఎంచుకోవాలి.

సూపర్ టాప్ అప్ మెడికల్ ప్లాన్ అనేది రెగ్యులర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ దీంట్లో డిడక్టబుల్ లిమిట్ నిబంధన ఉంటుంది. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లబ్ధిదారుల చికిత్సకు అయ్యే ఖర్చులను నిర్ణీత కవరేజీ ప్రకారం చెల్లిస్తాయి. కానీ సూపర్ టాప్ అప్ మెడికల్ ప్లాన్‌లో ముందుగా నిర్దేశించిన డిడక్టబుల్ లిమిట్ దాటితేనే పాలసీ చెల్లుబాటు అవుతుంది. ఈ లిమిట్ కంటే తక్కువగా అయ్యే వైద్యచికిత్స ఖర్చులను వ్యక్తులు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా ఈ బిల్లులను క్లెయిం చేసుకోవచ్చు. ఉదాహరణకు.. రూ.15 లక్షల సూపర్ టాప్‌అప్ ప్లాన్‌కు రూ.5 లక్షలు డిడక్టబుల్ లిమిట్‌ ఉందనుకుందాం. పాలసీదారుడి మెడికల్ బిల్లు రూ.5లక్షల లిమిట్ దాటితేనే సూపర్ టాప్‌అప్ ప్లాన్ వారికి వర్తిస్తుంది.

తక్కువ ప్రీమియం.. ఎక్కువ కవరేజీ
ఒక సంత్సరంలో పాలసీదారులకు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ఇన్సూరెన్స్ ద్వారా పొందాలనుకునేవారు రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు సూపర్ టాప్‌ అప్‌ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం మంచిది. వీటిల్లో ఉండే డిడక్టబుల్ లిమిట్ నిబంధన కారణంగా ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో పాలసీ తీసుకునేవారు సూపర్ టాప్ అప్ ప్లాన్ల ద్వారా ఎక్కువ లబ్ధి పొందవచ్చు. ఒక పాలసీ ఈయర్‌లో మల్టిపుల్ ఎలిజిబిలిటీ ఉండటం వీటి ప్రత్యేకత.

ప్రీమియం ఎంత వరకు ఉండవచ్చు?
వివిధ సంస్థలు అందిస్తున్న ఈ పాలసీల ప్రీమియం.. డిడక్టబుల్ లిమిట్, కవరేజీ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి రూ.15 లక్షల విలువైన సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకున్నాడు అనుకుందాం. పాలసీల డిడక్టబుల్ లిమిట్ రూ.5లక్షలు ఉందనుకుంటే... యాన్యువల్ ప్రీమియం రూ.1,500 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తుల వయస్సు, జెండర్, ఆదాయం, మెడికల్ హిస్టరీ, పొగతాగే అలవాట్లు, పాలసీ కవరేజీ, డిడక్టబుల్ లిమిట్, పాలసీ ఫీచర్లు, కంపెనీల నియమనిబంధనల ఆధారంగా పాలసీదారులకు వర్తించే ప్రీమియం మారవచ్చు.

ఎలా ఎంచుకోవాలి?
సంవత్సరంలో ఒకేసారి కవరేజీని అందించే సింగిల్ టాప్ అప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాప్‌ అప్ ప్లాన్ల వల్ల ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. సూపర్ టాప్ అప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎంచుకునేటప్పుడు తక్కువ ప్రీమియాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే సరిపోదు. ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిం సెటిల్మెంట్ రేషియో, నెట్‌వర్క్ హాస్పిటల్స్, పాలసీ ఫీచర్లు, బెనిఫిట్లు, డిడక్టబుల్ లిమిట్, ఇతర నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల ప్లాన్ల ధరలు, ఫీచర్లు పోల్చి చూడాలి. ఆ తరువాతే మెరుగైన పాలసీని ఎంచుకోవాలి.
Published by:Krishna Adithya
First published: