SUBMIT PAN CARD IN YOUR OFFICE TO AVOID HIGHER TAX DEDUCTIONS EXPLAINS PAN CARD RULES SS
PAN card rule: మీ ఆఫీసులో పాన్ కార్డ్ ఇవ్వలేదా? జీతం కట్
PAN card rule: మీ ఆఫీసులో పాన్ కార్డ్ ఇవ్వలేదా? జీతం కట్
(ప్రతీకాత్మక చిత్రం)
PAN card rule | మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? మీరు పనిచేసే ఆఫీస్లో మీ పాన్ కార్డ్ వివరాలు ఇచ్చారా? మీ పాన్ నెంబర్ ఇవ్వకపోతే మీ జీతంలో కోత పడొచ్చు. ఎందుకో తెలుసుకోండి.
పాన్ కార్డ్... ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరిగా అవసరమైన డాక్యుమెంట్. పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలి. అంతేకాదు... మీరు పనిచేసే ఆఫీసులో కూడా పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులందరూ తమ కార్యాలయాల్లోని హెచ్ఆర్ లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పాన్ నెంబర్ సబ్మిట్ చేయాలి. లేకపోతే మీ జీతంలో కోత పడే అవకాశం ఉంది. పాన్ కార్డు ఇవ్వని ఉద్యోగుల నుంచి టీడీఎస్ 20% కట్ చేయాలని యాజమాన్యాలను ఆదేశించింది ఆదాయపు పన్ను శాఖ. ఆదాయం పన్ను పరిధిని మించితే ఈ కోత తప్పదు. మీ టీడీఎస్ డిడక్షన్కు సంబంధించిన వివరాలను TRACES పోర్టల్లో చూడొచ్చు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి మీ వార్షికాదాయం రూ.2.5 లక్షలు లోపు ఉన్నట్టైతే మీరు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆదాయం రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలి. ఒకవేళ పాన్ కార్డ్ వివరాలు ఇవ్వకపోతే మీ జీతంలో 20% కన్నా ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం జీతం రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ మీ వేతనం ఎక్కువైతే, మీ నుంచి ఎక్కువగా పన్ను కట్ చేసినట్టైతే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ పరస్పరం మార్చుకోవచ్చని గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీ దగ్గర పాన్ నెంబర్ లేకపోతే మీ ఆధార్ నెంబర్ వెల్లడించొచ్చు. అయితే అంతకన్నా ముందే మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ ఇస్తున్నట్టైతే సరైన వివరాలు ఇవ్వాలి. లేకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం రూ.10,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మీ ఆధార్ నెంబర్ను పాన్ కార్డుతో లింక్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్-పాన్ నెంబర్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.