లైఫ్ ఇన్సూరెన్స్ లేదా జీవిత బీమా పాలసీలను తీసుకునేవారు సంబంధిత పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలపై అవగాహన పెంచుకోవాలి. పాలసీదారుడు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించేస్తే కవరేజీ అమల్లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులు ప్రీమియం చెల్లించలేమని భావించినప్పుడు.. సంబంధిత పాలసీని సరెండర్ చేసే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తాయి. ఇందుకు సరెండర్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ప్రయోజనాలను పాలసీదారుడు పూర్తిగా కోల్పోతాడు. సరెండర్ ఛార్జీలు ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి మారతాయి. పాలసీ రకం, చెల్లించిన ప్రీమియం, మొత్తం ప్రీమియం చెల్లించే కాలపరిమితి వంటి అంశాలపై కూడా ఈ ఛార్జీలు ఆధారపడి ఉంటాయి.
పాలసీదారుడు ఎంచుకున్న పథకాన్ని బట్టి కొన్ని కంపెనీలు సరెండర్ విలువను (సరెండర్ వ్యాల్యూ) చెల్లిస్తాయి. సరెండర్ చేయడానికి ముందు వరకు చెల్లించిన ప్రీమియంలో కొంతమొత్తాన్ని మినహాయించి మిగతా డబ్బును కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్), ఎండోమెంట్ ప్లాన్, టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ సరెండర్ చేసినప్పుడు ఎలాంటి నిబంధనలు అనుసరించాలో పరిశీలిద్దాం.
రెండు రకాల సరెండర్ వ్యాల్యూ
సాధారణంగా సరెండర్ వ్యాల్యూ రెండు రకాలుగా ఉంటుంది. గ్యారంటీడ్ సరెండర్ వ్యాల్యూ, స్పెషల్ సరెండర్ వ్యాల్యూ ఈ జాబితాలో ఉంటాయి. గ్యారెంటీడ్ సరెండర్ వ్యాల్యూలో.. పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం నుంచి నిర్ణీత శాతాన్ని చెల్లిస్తారు. కానీ దీని నుంచి మొదటి సంవత్సరం ప్రీమియం, రైడర్ ప్రీమియం వంటివి మినహాయిస్తారు. స్పెషల్ సరెండర్ వ్యాల్యూను బీమా మొత్తం, బోనస్, పాలసీ కాలపరిమితి, ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంల ఆధారంగా లెక్కిస్తారు. ఇది కంపెనీలను బట్టి మారుతుంది.
యులిప్‌లపై ప్రభావం
యులిప్స్ విషయంలో సరెండర్ విలువను చెల్లించేందుకు ఐదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తరువాత మాత్రమే సరెండర్ వాల్యూను కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ మొదటి మూడు సంవత్సరాల్లో యులిప్‌ను సరెండర్ చేస్తే.. ఇన్సూరెన్స్ కవరేజీ వెంటనే ఆగిపోతుంది. యులిప్ తీసుకున్న ఐదు సంవత్సరాల తరువాత పాలసీని సరెండర్ చేస్తే, అప్పటికి ఉన్న ఫండ్ విలువను లబ్ధిదారులకు చెల్లిస్తారు. ఆ తరువాత పాలసీ ప్రయోజనాలను ఆపేస్తారు.
ఎండోమెంట్ ప్లాన్లు
సాధారణంగా ఎండోమెంట్ ప్లాన్లకు మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ పాలసీని ఈ గడువుకు ముందే సరెండర్ చేస్తే.. గతంలో చెల్లించిన మొత్తం ప్రీమియాన్ని కంపెనీలు డీవ్యాల్యూ చేస్తాయి. ఈ సందర్భంలో పాలసీదారుడికి ఎలాంటి రిఫండ్ వర్తించదు.
టర్మ్ ఇన్సూరెన్స్
టర్మ్ ఇన్సూరెన్స్‌లో యాన్యువల్ ప్రీమియం చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నవారికి కంపెనీలు సరెండర్ వాల్యూను చెల్లించవు. పాలసీ సరెండర్ చేసిన వెంటనే పాలసీ రద్దు అవుతుంది. అంతే జీవిత బీమా కవరేజీ ఆగిపోతుంది. అయితే లిమిటెడ్ పేమెంట్ టర్మ్ ఇన్సూరెనస్ పాలసీలను సరెండర్ చేస్తే, పాలసీదారుడు చెల్లించిన ప్రీమియంలలో కొంత భాగాన్ని కంపెనీలు రిఫండ్ చేస్తాయి. ఒకవేళ పాలసీదారుడు రానున్న సంవత్సరాలకు సంబంధించిన ప్రీమియంలను ముందస్తుగా చెల్లిస్తే, ఆ మొత్తాన్ని సరెండర్ వ్యాల్యూగా పొందవచ్చు.
కొనసాగించడమే మంచిది
ఇన్సూరెన్స్ పాలసీలను సరెండర్ చేయడం సరైన నిర్ణయం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీవిత బీమా కవరేజీ ఆగిపోతుంది. పాలసీ ద్వారా అందే ఇతర బెనిఫిట్లు ఆగిపోతాయి. దీంతోపాటు కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే, వయసు పెరిగినందువల్ల ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకున్న తరువాత వాటిని కొనసాగించడమే మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance