హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market: స్టాక్ మార్కెట్లలో రక్తకన్నీరు.. అన్నీ ఢమాల్, ఢమాల్

Stock Market: స్టాక్ మార్కెట్లలో రక్తకన్నీరు.. అన్నీ ఢమాల్, ఢమాల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదుపులకు లోనయ్యాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ భయాలు భారత్‌లో మార్కెట్లను భయపెట్టాయి. దీంతో మధ్యాహ్నం సెషన్ తర్వాత మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి.

  భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదుపులకు లోనయ్యాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ భయాలు భారత్‌లో మార్కెట్లను భయపెట్టాయి. దీంతో మధ్యాహ్నం సెషన్ తర్వాత మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఓ దశలో సెన్సెక్స్ 2037 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 629 పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే, చివరి నిమిషాల్లో కొద్దిగా కోలుకున్నాయి. 3.30 గంటలకు మార్కెట్లు ముగిసే సమయానికి కొద్దిగా పుంజుకుని సెన్సెక్స్ 45,553.96 వద్ద ముగిసింది. అంటే ఈరోజు 1407 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 50 కూడా మార్కెట్ ముగిసే సమయానికి మొత్తం 432 పాయింట్లు నష్టపోయి 13328 వద్ద ముగిసింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 7 శాతం పడిపోయింది. మెటల్, ఇన్ ఫ్రా, బ్యాంక్, ఆటో , ఎనర్జీ రంగాలు 4 నుంచి 5 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, గెయిల్, హిందాల్కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 7 శాతం నష్టాన్ని నమోదు చేశాయి.

  వాస్తవానికి ఆరు రోజులుగా మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. జీవనకాల గరిష్టాలను నెలకొల్పుతూ వచ్చాయి. కానీ, ఉదయం సెషన్ ఆరంభంలోనే దేశీయ సూచీలు గరిష్ఠ స్థాయుల నుంచి కిందకు జారాయి. పలు యూరప్ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి మొదలుకానున్నాయని వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు మళ్లించాయని విశ్లేషకులు అంచనా వేశారు. బ్రిటన్‌లో కొత్త వైరస్ 70 శాతం వేగంగా విస్తరిస్తోందనే భయాలు మదుపరులను కలవరపెట్టాయి. అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేసినా కూడా అక్కడ కొత్త వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. మళ్లీ కర్ఫ్యూ విధించారు.

  మరోవైపు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమానాలను సస్పెండ్ చేసింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. 22వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి డిసెంబర్ 31వ తేదీ అర్దరాత్రి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అది 70 శాతం వేగంగా విస్తరిస్తోంది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం బ్రిటన్ విమానాలను రద్దు చేసింది. అలాగే, ఈనెల 22వ తేదీ అర్దరాత్రి 12 గంటల లోపు వచ్చే ప్రయాణికులు ఆయా విమానాశ్రయాల్లో తప్పనిసరిటీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. వారం రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. బ్రిటర్‌లో కొత్త రకం వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఆ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Nifty, Sensex, Stock Market

  ఉత్తమ కథలు