Education Corpus: పిల్లల ఉన్నత చదువుకు డబ్బు దాచాలనుకుంటున్నారా.. ఈ సూచనలు పాటించండి

(ప్రతీకాత్మక చిత్రం)

మొదటి నుంచే ప్రణాళిక వేసుకుంటే రుణాలు చేయకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుల కోసం క్రమంగా ఓ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకు కొన్ని మార్గాలు, సూచనలు..

  • Share this:
పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులందరూ కలలు కంటారు. అయితే చాలా మందికి ఇది ఆర్థికంగా సవాలుగా ఉంటుంది. మంచి పేరున్న కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే కొందరు ఎడ్యుకేషన్ లోన్స్ సహా రుణాలు చేసి పిల్లలను చదివించేందుకు సిద్ధమవుతారు. అయితే మొదటి నుంచే ప్రణాళిక వేసుకుంటే రుణాలు చేయకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుల కోసం క్రమంగా ఓ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకు కొన్ని మార్గాలు, సూచనలు..

అంచనాలు వేసుకోవాలి
పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో వారి ఉన్నత విద్యకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకోవాలి. పిల్లల కెరీర్​ లక్ష్యమేంటో తెలుసుకోవడంతో పాటు మరో రెండు ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు ఎంత ఖర్చవుతుందో అంచనాకు రావాలి. ప్రస్తుతమున్న ఉన్నత విద్య ఖర్చుకు.. ఏడాదికి 10 శాతం పెరుగుతుందనేలా ప్లాన్ చేసుకోవాలి. తమ పిల్లలు ఉన్నత విద్య వరకు వచ్చే సరికి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందనే వివరాలను ఆన్​లైన్ సిప్​ క్యాలిక్యులేటర్లను ఉపయోగించి తెలుసుకోవాలి. నెలకు ఎంత ఆదా చేస్తే అప్పటికల్లా అంత మొత్తం కూడగట్టగలమో తెలుసుకొని ఆ విధంగా పాటించాలి.

పెట్టుబడులు త్వరగా చేయాలి
ఆదా చేస్తున్న మొత్తానికి సరైన రిటర్న్స్​ వచ్చేలా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు పెట్టుబడులు ప్రారంభించాలి. 15 సంవత్సరాల కాలంలో రూ.20లక్షలు కూడబెట్టాలంటే నెలకు రూ.4,003 దాచాల్సి ఉంటుంది. దీనికి ఏడాదికి 12శాతం వడ్డీ రేటు వర్తించేలా ప్లాన్ చేసుకోవాలి. అదే ఏడు సంవత్సరాల్లోనే రూ.20లక్షల నిధిని ఏర్పాటు చేసుకోవాలంటే నెలకు రూ.15,305 దాచాలి. ఇలా లెక్కలు వేసుకొని మొదటి నుంచే డబ్బు దాస్తే.. పిల్లల ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

సిప్​(SIP) విధానం ఎంచుకోవాలి
క్రమం తప్పకుండా డబ్బు ఆదా చేసేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ (సిప్​)ను తప్పనిసరిగా ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ సహా మరిన్ని పెట్టుబడి మార్గాల్లో సిప్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ కొంత మొత్తం స్టాక్ మార్కెట్​లో సిప్ చేయాలనుకుంటే అన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్​మెంట్ చేయాలి.

మ్యూచువల్ ఫండ్స్​
సాధారణమైన వాటి కంటే మ్యూచువల్ ఫండ్స్​లో డైరెక్ట్​ ప్లాన్స్ తక్కువ ఎక్స్​పెన్స్​లో అందుబాటులో ఉంటాయి. వీటికి ఫండ్ మేనేజ్​మెంట్ ఎక్స్​పెన్సెస్​, డిస్ట్రిబ్యూటర్ కమిషన్​, అడ్వర్టైజింగ్ కమీషన్ లాంటి నిర్వహణ ఫీజులు తక్కువగా పడతాయి. దీంతో ఎక్కువ రాబడి ఉంటుంది. అందుకే మ్యూచువల్ ఫండ్స్​లో డైరెక్ట్ ప్లాన్​ను ఎంచుకోవడం మేలు. సుదీర్ఘ కాలం పెట్టుబడులు పెడితే మంచి రాబడి వస్తుంది.

ఇన్సూరెన్స్ తప్పనిసరి
ఒకేవేళ దురదృష్టవశాత్తు మృతి చెందితే పిల్లల చదువు కోసం కూడబెడుతున్న విధానం హఠాత్తుగా ఆగిపోతుంది. దీంతో పిల్లలు చదువు కొనసాగించడం కష్టమవుతుంది. అందుకే పెద్దలు ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. నెలవారి ఆదా మొత్తాన్ని లెక్కించేటప్పుడే ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఎప్పటికప్పుడు పరిశీలించాలి
ఆదా చేస్తున్నప్పుడు… ఎంత కూడబెడుతున్నాం.. రాబడి ఎంత వస్తుందనే విషయాన్ని తరచూ గమనించాలి. అన్నింటికీ క్రమంగా లెక్కలు వేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్​ను బాగా పరిశీలించాలి. ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఎలా పెరుగుతున్నాయో బేరీజు వేసుకోవాలి. ఒకవేళ ప్రస్తుతం తీసుకున్న మ్యూచువల్ ఫం​డ్​లో తక్కువ రాబడి వస్తుంటే.. మెరుగైన దానికి మారిపోవచ్చు. ఇందుకు కోసం గత మూడు సంవత్సరాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
Published by:Krishna Adithya
First published: