మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? ఫైనాన్స్ సదుపాయంతో కొత్త కారు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు డౌన్ పేమెంట్ లేకుండా కొత్త కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సరికొత్త ఆఫర్ ప్రకటించింది. టాటా సఫారీ కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. టాటా సఫారీ వాహనంపై 100 శాతం ఫైనాన్స్ సదుపాయం ప్రకటించింది. అంటే ఈ కారును కొనడానికి మీరు డౌన్‌పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు... ప్రాసెసింగ్ ఫీజు కూడా లేదు. వడ్డీ రేటుపై 0.25 శాతం తగ్గింపును కూడా ప్రకటించింది. అయితే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఆర్డర్ చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి. అంటే 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో టాటా సఫారీ కార్ కొనాలనుకునే కస్టమర్లు ఎస్బీఐ యోనో యాప్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా కార్ లోన్ తీసుకుంటే 20 నుంచి 30 శాతం వరకు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తానికే కార్ లోన్ లభిస్తుంది. 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో కార్ లోన్స్ లభించడం చాలా అరుదు. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బ్యాంకులు ఇలాంటి ఆఫర్స్ అప్పుడప్పుడూ ప్రకటిస్తుంటాయి. ఎస్బీఐ ప్రస్తుతం టాటా సఫారీ కారుపైనే 100 శాతం ఫైనాన్స్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కార్ కొనాలనుకునే కస్టమర్లు ముందుగా నియమ నిబంధనలన్నీ ఓసారి చదవాలి. యోనో ఎస్బీఐ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత Shop & Order పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Automobile సెక్షన్లో Tata Motors పైన క్లిక్ చేయాలి. అందులో మీకు టాటా సఫారీకి సంబంధించిన ఆఫర్ వివరాలు ఉంటాయి.
ప్రస్తుతం ఎస్బీఐలో కార్ లోన్ వడ్డీ రేట్లు చూస్తే యోనో ఎస్బీఐ యాప్ ద్వారా అప్లై చేసేవారికి 7.50% వడ్డీ వర్తిస్తుంది. టాటా సఫారీ కారుపై 0.25 శాతం వడ్డీ తగ్గుతుంది. ఇక ఇతర కస్టమర్లకు 7.75% వడ్డీ వర్తిస్తుంది.