Dalitha Bandhu | దళిత బంధు పథకానికి సంబంధించిన నిధులు ఇతరుల అకౌంట్లో పొరపాటున జమ అయిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎస్బీఐ ఉద్యోగి చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని (Dalitha Bandhu Scheme) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద దళిత కుటుంబాలకు రూ.10,00,000 చొప్పున నిధులు ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి చేసిన తప్పుతో లబ్ధిదారులు కానివారి అకౌంట్లోకి రూ.1.50 కోట్లు జమయ్యాయి. ఎస్బీఐ ఉద్యోగి కాపీ పేస్ట్ చేయడంలో చిన్న తప్పు చేయడంతో లోటస్ ఆస్పత్రికి చెందిన 15 మంది ఉద్యోగుల ఖాతాలో రూ.10,00,000 చొప్పున జమ అయ్యాయి. మొత్తం రూ.1.50 కోట్లు 15 మంది లోటస్ హాస్పిటల్స్ ఉద్యోగుల సాలరీ అకౌంట్లో జమయ్యాయి. వాస్తవానికి డబ్బులన్నీ దళిత బంధు పథకంలో భాగంగా 15 మంది లబ్ధిదారుల అకౌంట్లో జమ కావాల్సింది.
ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. ఎస్బీఐ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బ్రాంచ్లో ఈ ఘటన జరిగింది. అదే రోజున 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున జమ చేయాల్సి ఉంది. కానీ ఎస్బీఐ ఉద్యోగి చేసిన చిన్న తప్పుతో ఇతరుల అకౌంట్లోకి ఈ డబ్బులు వెళ్లాయి. బ్యాంకు సిబ్బంది సదరు ఉద్యోగులకు మాట్లాడితే 14 మంది నుంచి డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. కానీ ల్యాబ్ టెక్నీషియన్ అయిన మహేష్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోలేకపోయారు. కొన్ని రోజుల పాటు అతను ఫోన్లో కూడా అందుబాటులో లేడు.
ఏదైనా ప్రభుత్వ పథకానికి చెందిన డబ్బులు తన అకౌంట్లో జమ అయి ఉంటాయని భావించిన మహేష్ అందులో కొంత మొత్తాన్ని తన అప్పులు తీర్చేందుకు ఉపయోగించాడు. బ్యాంకు సిబ్బంది ఎన్నిసార్లు అడిగినా అతను డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత రూ.6,70,000 మాత్రమే తిరిగి ఇచ్చాడు. రూ.3,30,000 ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారం కాస్తా సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు చేరింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 403 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఈ పొరపాటుకు కారణమైన ఎస్బీఐ ఉద్యోగిపై కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.
బ్యాంకు సిబ్బంది ఇలాంటి పొరపాట్లు చేయడం సాధారణమే. ఈ పొరపాట్ల వల్ల ఒక వ్యక్తి అకౌంట్లో జమ కావాల్సిన డబ్బులు మరొక అకౌంట్లో జమ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయడమే సరైన పద్ధతి. లేకపోతే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఐపీసీ సెక్షన్ 403 ప్రకారం కేసు నమోదైతే రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలు పడొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.