STATE BANK OF INDIA ANNOUNCED LOWER INTEREST RATES ON HOME LOANS AND ZERO PROCESSING FEE SS GH
SBI Home Loan: ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన ఎస్బీఐ... తక్కువ వడ్డీకే హోమ్ లోన్, జీరో ప్రాసెసింగ్ ఫీజు
SBI Home Loan: ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన ఎస్బీఐ... తక్కువ వడ్డీకే హోమ్ లోన్, జీరో ప్రాసెసింగ్ ఫీజు
(ప్రతీకాత్మక చిత్రం)
SBI Home Loan | మీరు హోమ్ లోన్ (Home Loan) తీసుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఆఫర్‌ను ప్రకటించింది.
పండుగ సీజన్ సమీపిస్తుండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఆఫర్లు ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణ (Home Loan) వడ్డీ రేట్లను 6.7 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ స్కోరు (Credit Score) ఆధారంగా కస్టమర్లు ఈ వడ్డీ రేటును పొందవచ్చని ఎస్బీఐ తెలిపింది. అంతేకాదు, ఈ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజు కూడా మినహాయించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు రూ.75 లక్షలకు పైన గృహ రుణానికి ఎస్బీఐ కస్టమర్లు 7.15 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు పండుగ సీజన్ సందర్భంగా బ్యాంకు 6.70 శాతానికే గృహ రుణాలను అందించనుంది. రూ. 75 లక్షల రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధితో పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది.
ఈ ఆఫర్‌తో ఎంత లాభం?
ఈ ఆఫర్ వల్ల 45 బేసిస్ పాయింట్ల వడ్డీ ఆదాతో పరోక్షంగా రూ. 8 లక్షల వరకు భారీగా వడ్డీని రుణగ్రహీతలు ఆదా చేసుకోవచ్చని వివరించింది. అయితే, గతంలో వేతన జీవుల హోమ్‌లోన్ తీసుకుంటే 15 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అంతరాన్ని ఎస్బీఐ తొలగించింది. ఇకపై అందరికీ ఒకే రకమైన వడ్డీ రేటును అమలు చేయనుంది. ఇలా, కస్టమర్లందరికీ ఒకే రకమైన గృహ రుణ వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఉద్యోగేతరులు తీసుకునే రుణాలపై 45+15 మొత్తం 60 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చని తెలిపింది.
వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సిఎస్ శెట్టి మాట్లాడుతూ "మా గృహ రుణ వినియోగదారులకు పండుగ ఆఫర్లు ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. సాధారణంగా వడ్డీ రాయితీ అనేది వేతన జీవులకు మాత్రమే ఇస్తుంటారు. అది కూడా నిర్థిష్ట లోన్ పరిమితి వరకే ఇస్తారు. అయితే ఈసారి భిన్నంగా అందరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం. రుణ మొత్తం, రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా 6.7 శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేస్తాం” అని చెప్పారు.
మరోవైపు పండుగ సీజన్ ముందు గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గృహరుణాలను బదిలీ చేసుకునే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించారు. అయితే, ఈ పండుగ ఆఫర్లు ఎప్పటివరకు ఉంటాయనే దానిపై ఎస్బీఐ స్పష్టతనివ్వలేదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.