STATE BANK OF INDIA AND HDFC BANK REDUCED HOME LOAN INTEREST RATES IN FESTIVE SEASON SS GH
Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన SBI, HDFC... పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్లు
Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన SBI, HDFC... పండుగ సీజన్లో అదిరిపోయే ఆఫర్లు
(ప్రతీకాత్మక చిత్రం)
Home Loan Interest Rates | పండుగ సీజన్లో హోమ్ లోన్ (Home Loan) తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) భారీగా వడ్డీ రేట్లను తగ్గించాయి.
ఇళ్లు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు గృహ రుణాలపై (Housing Loan) తక్కువ వడ్డీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి తరుణమే వచ్చింది. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పలు బ్యాంకులు హోంలోన్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా SBI, HDFC హోంలోన్లపై (Home Loan) ప్రత్యేక ఆఫర్ ప్రకటించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు గృహ రుణాలపై 6.70 శాతం వడ్డీని అదిస్తోంది. సెప్టెంబరు 20 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అయితే క్రెడిట్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులవుతారు.
హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్
గతంలో స్థిర వేతనం పొందుతున్న హెచ్డీఎఫ్సీ కస్టమర్లు రూ. 75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణం పొందాలనుకుంటే.. క్రెడిట్ స్కోరు 800 ఉండాలనే నిబంధన ఉండేది. దీంతోపాటు వడ్డీ కూడా 7.15 శాతం వరకు ఉండేది. స్వయం ఉపాధి పొందుతున్నవారికైతే 7.30 శాతం వడ్డీని అందించింది. ఇప్పుడు కొత్త లోన్ రేట్లను బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన ఈ ఆఫర్ క్లోజ్ ఎండ్ స్కీమ్ అని, అక్టోబరు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని HDFC స్పష్టం చేసింది.
"ఈ రోజుల్లో గృహాలు చాలా సరసమైన ధరకే వస్తున్నాయి. గత రెండేళ్లలో ఆస్తుల ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతూ, తగ్గుతున్నప్పటికీ ఆదాయ స్థాయిలు మాత్రం పెరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, పీఎంఏవై కింద రాయితీలు, పన్ను ప్రయోజనాలు ఇందుకు సహకరించాయి" అని హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్ వేణు సూద్ కర్నాడ్ అన్నారు.
ఎస్బీఐ హోమ్ లోన్
గత వారమే ఎస్బీఐ గృహరుణాలపై వడ్డీని తగ్గించింది. 6.7 శాతానికి వడ్డీరేటును కుదించింది. క్రెడిట్ స్కోరుకు లింక్ అయిన హోంలోన్లకు ఈ వడ్డీరేటును అందిస్తోంది. ఇంతకుముందు రూ. 75 లక్షల కంటే ఎక్కువ రుణం పొందాలంటే 7.15 శాతం వడ్డీ వర్తించేది. ప్రస్తుతం పండుగ ఆఫర్‌ను ప్రవేశపెట్టడంతో 6.7 శాతానికి హోంలోన్ పొందవచ్చు. ఈ ఆఫర్ వల్ల 30 ఏళ్ల కాలపరిమితిలో రూ.75 లక్షల రుణంలో రూ.8 లక్షల వడ్డీని ఆదా చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఎస్బీఐ వేతనం పొందని, పొందే రుణగ్రహీతల మధ్య వ్యత్యాసాన్ని కూడా తొలగించింది. జీతం పొందే వారికి వర్తించే వడ్డీ రేటు కంటే పొందని వారికి వర్తించే వడ్డీరేటు 15 బేస్ పాయింట్లు ఎక్కువగా ఉండేట్లు చేసింది. కాబట్టి ఈ 15 బేస్ పాయింట్ల వడ్డీని వారు ఆదా చేసుకోవచ్చు. వృత్తితో సంబంధం లేకుండా రుణగ్రహీతలందరికీ ఆఫర్లను అందుబాటులో ఉంచామని ఎస్బీఐ ఎండీ సీఎస్ శెట్టి చెప్పారు. బ్యాలెన్స్ బదిలీ కేసులకు కూడా 6.7 శాతం హోంలోన్ ఆఫర్ వర్తిస్తుందని, పండుగ సీజన్ లో జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలు, వడ్డీ రేట్లు వినియోగదారును మరింత సరసమైనవిగా ఉంటాయని తెలిపారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.