Sukanya Samriddhi Account vs Mutual Fund రెండింట్లో ఏది బెటర్...

ప్రతీకాత్మకచిత్రం

Sukanya సుకన్య సమృద్ధి యోజన, మ్యూచువల్ ఫండ్లలో ఏది మంచిది? పిల్లల కోసం ప్రత్యేకంగా చాలా రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాటిలో దేన్ని ఎంచుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు.

  • Share this:
మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పొదుపు, పెట్టుబడులు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల భవిష్యత్తు, ఆర్థిక భరోసా కోసం పెట్టుబడులు పెట్టడం చాలా మంది తల్లిదండ్రులకు ప్రధాన సమస్యగా ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా చాలా రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాటిలో దేన్ని ఎంచుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు. సుకన్య సమృద్ది యోజన వంటి పథకాలకు ప్రభుత్వ హామీ, నిర్ణీత మొత్తంలో స్థిర రాబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు వంటి మరికొన్ని మార్గాలపై రాబడి హామీ ఉండదు. అందువల్ల సుకన్య సమృద్ధి యోజన (SSY), మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు అవి ఎలా పనిచేస్తాయి, వాటి లక్షణాలు, ప్రయోజనాలు, నష్టభయం.. తదితర విషయాలపై పెద్దవాళ్లు దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఆడపిల్లల ఆర్థిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకంలో పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. వారికి 21 సంవత్సరాల వయసు వచ్చాక మెచూరిటీ గడువు ముగుస్తుంది. తల్లిదండ్రులు చేసే డిపాజిట్లను మొదటి 15 సంవత్సరాలకు మాత్రమే స్వీకరిస్తారు. SSY నియమాల ప్రకారం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి కోసం సుకన్య సమృద్ధి అకౌంట్ మూసివేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం SSY వడ్డీ రేటు సంవత్సరానికి 7.6 శాతంగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మెచూరిటీ గడువు ముగిసిన తరువాత ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా అందే రాబడిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

మ్యూచువల్‌ ఫండ్లు కూడా..

మ్యూచువల్ ఫండ్లలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేకమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో ఈక్విటీ, డెట్ ఫండ్లు కలిపి పెట్టుబడి మార్గాలుగా ఉంటాయి.  "మ్యూచువల్ ఫండ్లలో చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక వర్గం. పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే నిధులను సమీకరించడానికి(కార్పస్ కోసం) వీటిని రూపొందించారు. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంచేందుకు ఇలాంటి పథకాలు ఉపయోగపడతాయి” అని గ్రోవ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, COO హర్ష జైన్ చెబుతున్నారు. పిల్లల కోసం రెగ్యులర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకు లార్జ్ క్యాప్ లేదా బ్లూ-చిప్ ఈక్విటీ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లను పరిగణించవచ్చని క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, CEO అర్చిత్ గుప్తా తెలిపారు.

ఏది మంచిది?

ఈక్విటీ ఫండ్లు దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, లిక్విడిటీ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ‘ఈక్విటీ ఫండ్లు చాలావరకు ఓపెన్-ఎండ్ ఫండ్లుగానే ఉంటాయి. వీటిలో ఎప్పుడైనా యూనిట్లను రీడీమ్ చేయవచ్చు. ఇవి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం, బెంచ్ మార్కుల ప్రభావానికి గురికాకుండా ఉండగలవు. SSY అందించే వడ్డీ రేటు పరిమితంగానే ఉంటుంది. ఈ వడ్డీ రేట్లపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుంది. SSY వడ్డీ రేట్లను ప్రతి సంవత్సరం ప్రభుత్వం సవరిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో రేట్లు తగ్గుతున్నాయి’ అని గుప్తా వివరిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంటుగా పరిగణించవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీ లింక్డ్ ఇన్‌స్ట్రుమెంట్లు. పెట్టుబడి పెట్టే గడువు, మెచూరిటీ, నష్టభయం వంటి వాటి ఆధారంగా తల్లిదండ్రులు పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని TBNG క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ బిరానీ తెలిపారు.

రెండింట్లో పెట్టుబడులు పెట్టాలి

పెట్టుబడుల్లో డైవర్సిటీని పాటించడం మంచిదని బిరానీ చెబుతున్నారు. ‘SSY, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడానికి బదులుగా, రెండింటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన వడ్డీ రేటుతో ట్యాక్స్ మినహాయింపు, రాబడి హామీ వంటి ప్రయోజనాలు SSY ద్వారా పొందవచ్చు. దీర్ఘకాలిక అవసరాలకు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్, లార్జ్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ ఫండ్స్)లో పెట్టుబడి పెడితే అధిక రాబడిని వచ్చే అవకాశం ఉంది’ అని బిరానీ వివరిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: