ప్రస్తుతం మనదేశంలో ఔషధ గుణాలున్న మొక్కలకు (Medicinal Plants) డిమాండ్ పెరుగుతోంది. అందుకే చాలా మంది రైతులు సంప్రదాయ ఆహార పంటలను కాకుండా.. ఇలాంటి పంటల వైపు మొగ్గు చూప్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ.. లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాంటి పంటల్లో ఒకటి స్పిరులినా (Spirulina Farming). ఇందులో 60-70 శాతం ప్రొటీన్ ఉంటుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అనేక మందుల్లో దీనిని వినియోగిస్తున్నారు. నేరుగా టాబ్లెట్స్ ((Spirulina Tablets) రూపంలో కూడా విక్రయిస్తున్నారు. అందుకే దీనికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. స్పిరులినాకు మట్టితో పనిలేదు. ఇంటి వద్ద ట్యాంకుల్లో కూడా పండించవచ్చు. సూర్యరశ్మి ఎంత ఉంటే అంత ఉత్పత్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఆదాయం వస్తుంది.
స్పిరులినాను సముద్ర నాచు అంటారు. ఉప్ప నీటిలో బాగా పెరుగుతుంది. స్పిరులినా సాగుకు మనం సాగు చేస్తున్న ప్రాంతంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల వరకు ఉండాలి. 15 °C కంటే తక్కువగా ఉండకూడదు. నీటి pH 9 కంటే ఎక్కువగా ఉండాలి. అలా లేకుంటే.. సోడియం క్లోరైడ్, బేకింగ్ సోడా, ఉప్పు కలపడం వల్ల నీటి పీహెచ్ విలువను 9కి తీసుకురావచ్చు. స్పిరులినా సాగుకు మీ పొలం వద్ద లేదా ఇంటి వద్ద పొడవైన ట్యాంకులను నిర్మించుకోవాలి. అడుగుభాగంలో ప్లాస్టిక్ కవర్ వేసి నీటిని నింపాలి. అనంతరం తల్లి స్పిరులినా (Spirulina Culture) తెచ్చి.. ఒక వస్త్రంలో ఉంచి.. ట్యాంక్ మొత్తంలో తిప్పాలి. ట్యాంక్‌లోని నీటిని కదిలిస్తూ ఉండాలి. టైమర్‌తో పనిచేసే చిన్న మోటారును వినియోస్తే మంచిది. వాటిలో ప్రతి అరగంటకోసారి కదిపితే చాలు. ఇలా చేయడం వల్ల స్పిరులినా నీళ్లంతా వ్యాపించి త్వరగా తయారవుతుంది. ఒకసారి స్పిరులినా కల్చర్ వేశాక.. 15 రోజుల తర్వాత స్పిరులినా తయారవుతుంది. అప్పటి నుంచి ప్రతిరోజూ స్పిరులినాను తీయవచ్చు.
స్పిరులినా తయారయ్యాక నీరు ఆకు పచ్చగా మారుతుంది. ఆ నీటిని వస్త్రం ద్వారా ఫిల్టర్ చేయాలి. అప్పుడు వస్త్రం పైభాగంలో స్పిరులినా ఉండిపోయి..నీరు మళ్లీ ట్యాంకులోకి వెళ్లిపోతుంది. వస్త్రంపై నుంచి స్పిరులినాను సేకరించి.. నీటితో బాగా శుభ్రం చేయాలి. అనంతరం నీరు మొత్తం పోయేలా వడకట్టాలి. వడకట్టిన తర్వాత మిగిలిన స్పిరులినాను నేరుగా తినవచ్చు. లేదంటే పూర్తిగా ఎండబెట్టి.. పొడి చేయవచ్చు. టాబ్లెట్స్ రూపంలోకి కూడా మార్చి.. నిల్వ చేయవచ్చు.
50 మీటర్ పొడవు.. 5 మీటర్ల వెడల్పు ఉండే రెండు ట్యాంకులతో స్పిరులినా పాటు చేయాలనుకుంటే.. రూ.3 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. చాలా ఆ తర్వాత పెద్దగా ఖర్చు ఉండదు. మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు. ప్రతి రోజూ స్పిరులినా తీసేటప్పుడు తప్ప.. ఇతర సమయాల్లో పని ఉండదు. మదర్ కల్చర్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది బాగుంటేనే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే క్వాలిటీది తీసుకోవాలి.
రెండు ట్యాంకుల నుంచి ప్రతిరోజు 60 కేజీల తడి స్పిరులినాను ఉత్పత్తి చేయవచ్చు. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత 7 కేజీలు అవుతుంది. మార్కెట్లో ఒక్కో కేజీని 600కు అమ్మినా.. 4,200 ఆదాయం వస్తుంది. తద్వారా నెల నెలా రూ.లక్షా 20వేల వరకు సంపాదించవచ్చు. ఇందులో ఖర్చులు పోను.. నెలకు రూ.70-80వేల వరకు లాభం మిగులుతుంది. ట్యాంకుల సంఖ్య పెంచుకుంటే.. ఆదాయం ఇంకా పెరుగుతుంది.
మనదేశంలో స్పిరులినా పొడిని కొనే కంపెనీలు చాలానే ఉన్నాయి. వారిని సంప్రదించి మీ పంటను విక్రయించవచ్చు. ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న స్పిరులినాను చేపలు, రొయ్యలు, కోళ్ల వ్యాపారులు కొంటున్నారు. దీనిని మేతగా వేయడం వల్ల తక్కువ సమయంలోనే అవి బరువు పెరుగుతాయి. అలాంటి వ్యాపారులను కలిసి వారికి కూడా స్పిరులినా ఉపయోగించవచ్చు. మీరు ఇంటర్నెట్‌లో ఎక్స్‌పోర్టర్స్‌ని సంప్రదించి.. ఇతర దేశాలకు కూడా అమ్ముకోవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business Ideas, Farmers, Local News