news18-telugu
Updated: November 25, 2020, 10:16 PM IST
ప్రతీకాత్మకచిత్రం
డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ రోజుల్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు పెట్టొచ్చు. లేదంటే చిన్న పొదుపు పథకాల (ఎస్ఎస్ఎస్)ల్లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్న పొదుపు పథకాల్లో డబ్బు పెట్టడం ద్వారా ఎటువంటి నష్టభయం లేకుండా మంచి రాబడి పొందవచ్చు. అధిక రాబడిని ఇచ్చే సుకన్య సమితి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాల గురించి తెలుసుకోండి.
సుకన్య సమృద్ధి పథకంఆడపిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో చేరాలంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల కుమార్తె/కుమార్తెలను కలిగి ఉండాలి. కుమార్తె విద్య, వివాహ లక్ష్యం కోసం ప్రణాళికను ఎంచుకోవడంలో భాగంగా ఇది ఉపయోగపడుతుంది. సుకన్య సమృద్ధి పథకంతో పెట్టుబడిపై ప్రస్తుతం 7.6% రాబడి వస్తుంది. పెట్టుబడిదారుడు ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు ఈ ఖాతాలో నగదు జమ చేయవలసి ఉంటుంది. ఈ పథకంలో గరిష్టంగా సంవత్సరానికి రూ. 1,50,000 జమ చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ బెనిఫిట్ అందుతుంది. దీనిలో పెట్టుబడికి- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద గరిష్టంగా రూ .1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. దీనిలో పెట్టుబడిపై లభించే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్
ఉద్యోగి పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగడానికి జాతీయ పెన్షన్ పథకం (‘ఎన్‌పిఎస్’)లో పెట్టుబడి ఉపయోగపడుతుంది. దీనిలో పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పిఎస్ అనేది పెన్షన్ పథకం. ఇది ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకు ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. పదవీ విరమణ తరువాత, పెట్టుబడిదారుడు పొదుపు చేసిన మొత్తంలో గరిష్టంగా 60 శాతాన్ని ఒకేసారి అందుకుంటాడు. మిగిలిన 40 శాతాన్ని పదవీ విరమణ అనంతర ఆదాయం కోసం యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో 60 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే చేరవచ్చు. అందువల్ల, ఇది పదవీ విరమణ లక్ష్యాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్)
పిపిఎఫ్ అనేది సేవింగ్ కమ్ టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. దీనిలో 15 సంవత్సరాల కాలానికి పెట్టే పెట్టుబడిపై సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద గరిష్టంగా ఏటా రూ .1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా సంపదను కూడబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. 15 నుంచి 20 సంవత్సరాల వరకు పెట్టుకునే లక్ష్యాలకు పిపిఎఫ్ సమర్థవంతంగా పనిచేస్తుంది. 15 సంవత్సరాల కాలానికి గాను ఏటా రూ .1,50,000 పెట్టుబడి పెడితే, పథకం కాలం ముగిసే సమయానికి సుమారు రూ .40 లక్షలు లభిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)
60 ఏళ్లు పైబడిన భారతీయులు ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఎస్సీఎస్ఎస్ స్కీమ్‌లో గరిష్టంగా రూ .15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కాగా, ఈ పథకంలో మొదట ఐదేళ్ల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. దీనిని మూడేళ్ల కాలానికి ఒకసారి మాత్రమే పొడిగించవచ్చు. ఎస్సీఎస్ఎస్ కింద పెట్టే పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్కీమ్ కింద వచ్చే వడ్డీ ప్రతి మూడు నెలలకొకసారి చెల్లించబడుతుంది. దీనిలో పెట్టుబడికి సెక్షన్ 80 సి కింద ఏటా గరిష్టంగా రూ .1,50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కాగా, ఈ పథకంపై లభించే వడ్డీపై పన్ను వసూలు చేయబడుతుంది. అయినప్పటికీ, పెట్టుబడిదారుడు సెక్షన్ 80 టిటిబి కింద రూ .50,000 వరకు వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకం సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వృద్ధాప్య వయస్సులో ఎటువంటి రిస్క్ లేకుండా అధిక భరోసాతో కూడిన రాబడిని అందిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి)
ఎన్ఎస్సి అనేది 5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో వచ్చే స్థిర ఆదాయ పథకం. ఇందులో లభించే వడ్డీ తిరిగి పెట్టుబడిగా మారుతుంది. ఒక పెట్టుబడిదారుడు ఏటా ఎన్‌ఎస్‌సిలో రూ .1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. దీని కింద సంపాదించిన వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. పథకాన్ని ఎంచుకునే ముందు భవిష్యత్ లక్ష్యాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడిదారుడు గుడ్డిగా పెట్టుబడిని ఎంచుకోకూడదని గమనించాలి.
Published by:
Krishna Adithya
First published:
November 25, 2020, 10:16 PM IST