డబ్బు ఆదా చేసే విషయంలో భారతీయ మహిళలు ముందుంటారు. కుటుంబ ఆదాయానికి తగ్గట్టుగానే ఇంటి బడ్జెట్ ప్లాన్ చేస్తారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. దీంతో తమ సంపాదను సేవింగ్స్‌లో ఉంచుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సంప్రదాయ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతున్నారని, స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్ వంటివాటిలో పెట్టేందుకు సిద్ధంగా ఉండట్లేదని ఇటీవల విడుదలైన ఓ సర్వే చెబుతోంది.
ఎప్సిలాన్ మనీ అనే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సంస్థ.. మహిళల్లో ఆర్థిక అవగాహన కల్పించడం కోసం ‘ఫైనాన్స్ డివ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దేశంలో 37 ప్రధాన నగరాల్లోని మహిళా పెట్టుబడిదారులపై సర్వే చేపట్టింది. దీని ప్రకారం 47% మంది మహిళలు తమ ఆదాయంలో 10% నుంచి 30% మొత్తాన్ని సేవింగ్స్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే వీరంతా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposit), సేవింగ్స్ ఖాతా (Savings Account)వైపే దృష్టి పెడుతున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలపై దృష్టి పెట్టట్లేదు.
సర్వేలో ఆసక్తికర విషయాలు
37 నగరాల్లో సర్వే జరగ్గా 33% మంది పార్టిసిపెంట్లు టైర్-2, టైర్-3 నగరాలకు చెందినవారే. ఇందులో 60% మంది మహిళలు 18 నుంచి 30 మధ్య వయసుకు చెందినవారు. 32% మంది 31 నుంచి 45 వయసుకు చెందినవారు. 7% మంది 45 నుంచి 60 మధ్య వయసు వారు కాగా, 1% మంది 60కి పైబడిన మహిళలు. ఇందులో 49% మంది శాలరీ కోసం పనిచేస్తున్న ఉద్యోగులు. 16% మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్, 12% మంది ప్రొఫెషనల్స్, 23% మంది గృహిణలు.
ప్రతిబింబిస్తున్న ఆకాంక్షలు
ఈ ఫలితాలు భారతీయ మహిళల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని ఎప్సిలాన్ మనీ ప్రాంతీయ డైరెక్టర్ వర్షా చోప్రా తెలిపారు. ఫైనాన్షియల్ నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నట్లు 44% మంది మహిళలు సర్వేలో చెప్పారు. ఇతరుల సలహాలు తీసుకుంటున్నట్లు 56% మంది చెప్పారు. ఈ గణాంకాలు అభివృద్ధి చెందుతున్న ఆధునిక మహిళలను సూచిస్తున్నాయని వివరించారు.
మహిళలను ప్రోత్సహించేందుకే..
దేశంలో పొదుపు చేసే సంస్కృతి ఎక్కువగా ఉన్న కారణంగా ఇండియాను పొదుపైన ఆర్థిక వ్యవస్థగా ఎప్సిలాన్ మనీ డైరెక్టర్ మధు స్మితా సింగ్ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో డబ్బును పొదుపు చేయడంలో మహిళలదే కీలకపాత్ర అని కూడా అన్నారు. ప్రస్తుతం వారిని మిగిలిన ఇన్వెస్టమెంట్ల వైపు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టామని చెబుతున్నారు. దీంతో ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఆర్థిక అక్షరాస్యత కోసం..
60% మహిళా పెట్టుబడిదారులు లిక్విడిటీ, భద్రత కోసం సంప్రదాయ పెట్టుబడి విధానాన్నే అనుసరిస్తున్నారని సర్వే చెబుతోంది. ఈ క్రమంలో వారిలో ఆర్థిక అక్షరాస్యత పెంచడం కోసం సమాచారంతో కూడిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేలా, అందుకు తగ్గ వనరులు కల్పించేలా ఏర్పాటు చేస్తామని స్మితా సింగ్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.