ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్(Insurance) ఉండడం ఎంతో మంచిది. ఈ ఆరోగ్య బీమాను(Health Insurance) అదనపు ఖర్చుగా కాకుండా.. మనపై మనం పెట్టుకుంటున్న పెట్టుబడిగా భావించాలి. అయితే ఈ బీమా పాలసీల నుంచి సరైన ప్రయోజనాన్ని పొందాలంటే బీమాతో పాటు రైడర్లను(Ryders) కూడా ఎంచుకోవాలి. రైడర్ అంటే అసలైన పాలసీతో(Policy) పాటు కొన్ని అదనపు ప్రయోజనాలను అందించే ఒక రకమైన యాడ్-ఆన్. సాధారణంగా బీమా పాలసీల్లో కొన్ని పరిమితులుంటాయి. వీటిని అధిగమించాలంటే కొన్ని రైడర్లను ఎంచుకోవాలి. సాధారణ బీమా పాలసీతో పాటు కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పించేవే ఈ రైడర్లు. వీటి ద్వారా అనారోగ్యం సమయంలో అదనపు భారం మనపై పడకుండా కాపాడుకోవచ్చు. రకరకాల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ రైడర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. అవేంటో చూద్దాం.
Cricket Rules: క్రికెట్ రూల్స్ మార్చిన రెండు సంఘటనలు.. ఆటలో ఎలాంటి మార్పులు వచ్చాయంటే..?
క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్
తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య ఖర్చులు, ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కోలుకునేంత వరకు అయ్యే ఖర్చులు, శాశ్వత వైకల్యం కలిగినప్పుడు పాలసీదారుడిపై ఆధారపడిన వారికి క్రమంగా ఆదాయం లాంటి వాటికి ఈ రైడర్ ఉపయోగపడుతుంది.
హాస్పిటల్ డైలీ క్యాష్
ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చు కాకుండా హాస్పిటల్ లో రోజువారీ ఖర్చులు బోలెడు ఉంటాయి. దాంతో పాటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక రోజువారీ ఆదాయం కూడా ఆగిపోతుంది. అందుకే ఈ అదనపు రైడర్ తీసుకోవడం ద్వారా ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు రోజుకి కొంత మొత్తం చొప్పున బీమా కంపెనీ అందజేస్తుంది.
కంజ్యూమరబుల్ కవర్ రైడర్
టెక్నాలజీ పెరిగాక హాస్పిటల్ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ అవసరాలకోసం కొత్తగా రూపొందించిన రైడర్ ఇది. ఈ రైడర్ ఆరోగ్య బీమా ప్లాన్‌లో కవర్ చేయబడని కొత్త ఖర్చులను భరిస్తుంది. చేతి గ్లవుజులు, పీపీఈ(PPE) కిట్‌లు, సర్జికల్ వస్తువులు లాంటి వాటికి ఈ మొత్తాన్ని వాడుకోవచ్చు.
మెటర్నిటీ రైడర్
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ లు డెలివరీ ఖర్చులకు బీమా కల్పించవు. దీన్ని అధిగమించేందుకే ఈ మెటర్నిటీ రైడర్. ఇందులో డెలివెరీకి అయ్యే ఖర్చు, శిశువు ఆరోగ్య సమస్యలతో పుట్టినప్పుడయ్యే వైద్య, సంరక్షణకు అయ్యే ఖర్చులను చెల్లిస్తాయి.
ఎన్‌సీబీ ప్రొటెక్షన్ రైడర్
ఏదైనా సంవత్సరంలో మన ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసుకోకపోతే ఈ రైడర్ ద్వారా ఆ ప్రయోజనాన్ని తిరిగి పొందొచ్చు. నో-క్లెయిమ్ బోనస్(ఎన్‌సీబీ) రైడర్ ద్వారా ఇన్సూరెన్స్ హామీ మొత్తాన్ని వాడుకోకపోతే దాన్ని వంద శాతం వరకూ పెంచుకుని తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
రూమ్ రెంట్ ఎగ్జమ్షన్
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద హాస్పిటల్ రూం రెంట్ చార్జీలు కవర్ అవ్వవు. దీనికోసం పాలసీదారు తన జేబులో నుండి అదనపు ఖర్చు చెల్లించాలి. ఈ రైడర్ బీమా పాలసీ ద్వారా ఆసుపత్రి గది అద్దె ఛార్జీలను బీమా ద్వారా పొందొచ్చు.
రైడర్ తీసుకునే ముందు..
కొన్ని నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైడర్‌ను తీసుకోవాలి. ప్రతి రైడర్‌కు కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ పూర్తిగా తెలుసుకుని వీటిని ఎంచుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పాలసీలో కవరయ్యే అంశాలు, కవర్ కాని అంశాలు, వాటికి అయ్యే ఖర్చులు, పరిమితులు, అవసరమయ్యే రైడర్లు వంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health benefits, Health Insurance