Investments in Reliance Retail: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో మరో భారీ పెట్టుబడి వచ్చింది. అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సహ పెట్టుబడిదారులు రిలయన్స్ రిటైల్‌లో రూ.1875 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీంతో కలిపి మొత్తం సిల్వర్ లేక్, దాని సహ పెట్టుబడిదారులు కలిపి రిలయన్స్ రిటైల్‌లో రూ.9735 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. ఆ రకంగా రిలయన్స్ రిటైల్‌లో 2.13 శాతం షేర్లను దక్కించుకుంటాయి. తాజా పెట్టుబడితో కలిపి రిలయన్స్ రిటైల్ ప్రీ మనీ ఈక్విటీ విలువ రూ.4.285 లక్షల కోట్లుగా ఉంది. గతంలో సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్ ఫాంలో కూడా పెట్టుబడులు పెట్టింది.
మే 3న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్, జియో మధ్య ఒప్పందం కుదిరింది. సిల్వర్ లేక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొదటి డీల్‌తో రూ.5,655.75 కోట్లు, రెండో డీల్‌తో రూ.4,546.80 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ రెండు డీల్స్ ద్వారా 2.08 శాతం ఈక్విటీ వాటా పొందింది సిల్వర్ లేక్. ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లో 2.13 శాతం వాటా కోసం రూ.9735 కోట్లు చెల్లిస్తోంది. సిల్వర్ లేక్ సంస్థకు 60 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రపంచంలోని దిగ్గజ టెక్, టెక్ ఆధారిత సంస్థల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టింది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడంలో సిల్వర్ లేక్ సంస్థ గ్లోబల్ లీడర్.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి పెట్టుబడుల వరద పారుతోంది. సిల్వర్ లేక్ సంస్థతో పాటు ఈరోజే అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను రూ.3675 కోట్లకు కొనుగోలు చేయనుంది జనరల్ అట్లాంటిక్. సెప్టెంబర్ 9న సిల్వర్ లేక్ సంస్థ రూ.7,500 కోట్ల పెట్టబడులతో రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ రోజు మరో రూ. 1875 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. సెప్టెంబరు 23న కేకేఆర్ అనే మరో ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ రూ.5,550 పెట్టబడులతో రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను దక్కించుకుంది.
ఇక గత నెలలో ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.24,713 కోట్లు చెల్లించి ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ (RRFLL)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, రిలయన్స్ రిటైల్.. భారత్‌లో అతిపెద్ద రిటైల్ సంస్థ. దేశవ్యాప్తంగా 7వేల నగరాల్లో 12వేల స్టోర్‌లు నిర్వహిస్తోంది. తద్వారా 64 కోట్ల మందికి సేవలందిస్తోంది. భారత్‌లో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు దీటుగా రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.