కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ ఆసియా దేశాల్లో ఆర్థికమాంద్యం ప్రభావం ఇప్పుడిప్పుడే మన దేశం మీద పడుతోంది. ఇలాంటి తరుణంలో నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, సామాన్యులకు ఊరటను ఇస్తుందా, పన్నులు ఎలా ఉండబోతున్నాయని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సమయం పరంగా..
నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న అయిదో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎక్కువ సేపు బడ్జెట్ చదివిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. 2019 జులై 5న తన మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్ 2 గంటల 17 నిమిషాలు పద్దుల వివరాలు చదివి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌లో ఏకంగా 2 గంటల 42 నిమిషాలు ప్రసంగం చేసి తన రికార్డు తానే బద్దలు కొట్టారు. ఇందులో మొత్తం 13,275 పదాలు ఉన్నాయి. అప్పటికే ఆమె బాగా అలసిపోయారు. ఇంకా రెండు పేజీలు ఉన్నా.. వాటిని చదివినట్లు పరిగణించాలని స్పీకర్‌ను కోరారు. అంతకుముందు ఈ రికార్డు జస్వంత్ సింగ్ పేరు మీద ఉండేది. 2003లో ఆయన 2 గంటల 15 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చేశారు.
పదాల పరంగా పెద్ద బడ్జెట్
1991లో భారత్ దివాళా అంచుకు వెళ్లింది. అప్పటి ప్రధాని పీ.వీ.నరసింహారావు నేతృత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ముఖచిత్రాన్నే మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 18,650 పదాలతో ఎక్కువ పదాలు ఉన్న బడ్జెట్‌గా రికార్డు ఉంది. అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫీట్ దగ్గరకు వచ్చినా క్రాస్ చేయలేకపోయారు. 2018లో 18,604 పదాలు, 2015లో 18,122 పదాలు, 2018లో 17,991 పదాలు, 2014లో 16,528 పదాలు ఉపయోగించారు.
అతి చిన్నది..
1977లో అప్పటి విత్తు మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ 800 పదాలతో దేశంలోనే అతిచిన్న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021లో 10,500 పదాలున్న బడ్జెట్ ప్రవేశపెట్టి 1 గంట 40 నిమిషాల్లో పూర్తి చేశారు నిర్మలా సీతారామన్. దీని మరో ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి పేపర్‌లెస్‌గా ట్యాబ్లెట్‌లో చూసి ప్రసంగం చేశారు.
ఎప్పటికీ గుర్తుండిపోయే బడ్జెట్ ప్రసంగాలు..
మిలీనియం బడ్జెట్
2000లో యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశంలో ఐ.టీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి రోడ్ మ్యాప్‌లా ఉపయోగపడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. 21 రకాల కంప్యూటర్ వస్తువులపై ట్యాక్స్ తగ్గించింది.
డ్రీమ్ బడ్జెట్
1997-98లో లాఫర్ కర్వ్ సూత్రాన్ని ఉపయోగించి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాబడి పెంచేందుకు పన్ను రేట్లు తగ్గించడంతో దీనికి ఆ పేరు వచ్చింది. నల్లధనం వెలికి తీయడానికి సంస్కరణలు చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రేటును 40 నుంచి 30 శాతానికి, కంపెనీలకు 35 శాతానికి తగ్గించారు. కస్టమ్స్ ట్యాక్స్‌ను 40 శాతానికి తగ్గించి, ఎక్సైజ్ ట్యాక్స్‌ను సులభతరం చేసింది.
ఎపోకల్ బడ్జెట్ (Epochal Budget)
1991లో దేశం ఆర్థికంగా పతనం అంచున ఉన్న వేళ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన దీన్ని ఎపోకల్ బడ్జెట్ అంటారు. కస్టమ్స్ ట్యాక్స్‌ను 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గించి ఎగుమతులు ప్రోత్సహించారు. ఆర్థిక సరళీకరణకు తెరలేపారు.
క్యారెట్ & స్టిక్ బడ్జెట్ (Carrot & Stick Budget)
1986 ఫిబ్రవరి 28న వి.పి.సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను క్యారెట్ & స్టిక్ బడ్జెట్ అంటారు. ఇందులో మంచి, ఇబ్బంది కలిగించే రెండురకాల నిర్ణయాలు ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. దేశంలో లైసెన్స్ రాజ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (MODVAT) క్రెడిట్‌ను ప్రవేశపెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023