నిర్మాణ రంగంలో టైకూన్ గా ఖ్యాతి పొందిన షాపూర్జీ పల్లోంజీ (Shapoorji Pallonji) గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (Pallonji Mistry) (93) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. భారత్ లో పుట్టి పెరిగి ఐరిష్ సంతతి పారిశ్రామికవేత్త అయిన పల్లోంజీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఐరిస్ సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కారు.
పల్లోంజీ మిస్త్రీ నేతృత్వంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటిగా ఎదిగింది. 2022 జూన్ 28వతేదీ నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం పల్లోంజీ ఐరిష్ జాతియుల్లో అత్యంత ధనవంతుడు. పల్లోంజీ మిస్త్రీ నికర ఆస్తుల విలువ 28.90 బిలియన్ డాలర్లు.షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్18 ప్రధాన కంపెనీలతో కూడిన ప్రపంచవ్యాప్త సంస్థగా ఉంది.
షాపూర్జీ పల్లోంజీ సంస్థ 1865లో ఏర్పాటైంది. ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారం సాగిస్తోంది. ఇక్కడే పుట్టిపెరిగినప్పటికీ పల్లోంజీ మిస్త్రీ 2003లో భారత పౌరసత్వం వదులుకొని పూర్తిగా ఐరిస్ జాతీయుడిగా మారిపోయారు. పారిశ్రామిక రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2013లో పల్లోంజీ మిస్త్రీకి పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేసింది.
షాపూర్జీ పల్లోంజీ సంస్థ దేశంలో ప్రముఖ నిర్మాణాలెన్నిటినో చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలు కూడా షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తోంది. మరో వివేషం ఏటంటే, టాటా సన్స్ గ్రూపులో అత్యధిక వాటా పల్లోంజీ మిస్త్రీదే. టాటా గ్రూపులో ఆయనకు 18.4% వాటా ఉంది. పల్లోంజీ మిస్త్రీ మరణంపై రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార వర్గాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Tata Group