కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్స్.. భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ‘హ్యుందాయ్ క్రెటా’ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. SUV విభాగంలో ఎన్ని కొత్త మోడళ్లు విడుదలైనా సరే కస్టమర్ల మొదటి ఎంపిక క్రెటానే ఉంటోంది. తాజాగా క్రెటా మరో వేరియంట్ ని లాంఛ్ చేయానికి సిద్ధమవుతోంది. హ్యుందాయ్ క్రెటాకి ఎక్స్ టెండెడ్ వర్షన్ గా ఓ 7 సీటర్ మోడల్ ని విడుదల చేయనుంది. ఈ మోడల్ 2021 మధ్యకాలంలో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని హ్యుందాయ్ స్పష్టం చేసింది. ఈ నూతన మోడల్ కోసం హ్యుందాయ్ ఇప్పటికే ఓ కొత్త పేరును కూడా ట్రేడ్ మార్క్ కోసం రిజిస్టర్ చేసుకుంది. ‘హ్యుందాయ్ అల్కజార్’ పేరుతో ఈ మోడల్ భారత మార్కెట్లోకి విడుదల కానుంది. కాగా, ఈ సరికొత్త ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన కొత్త చిత్రాలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. దీని ఫ్రంట్, సైడ్ డిజైన్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొత్త క్రెటా మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇంటీరియర్ డిజైన్లో మాత్రం పెరిగిన క్యాబిన్ స్పేస్ కారణంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
7 సీటింగ్ కోసం ఈ ఎస్ యూవీ పొడవును కాస్తంత పెంచినట్లుగా అనిపిస్తుంది. తద్వారా ఈ ఎస్ యూవీలో విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. అంతేకాక, దీనిలో 10.25- అంగుళాల యూనిట్ కంటే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ని అందించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఆటో-డిమ్మింగ్ IRVM కూడా అందిస్తుంది. ప్రస్తుత క్రెటా మోడల్ తో పోలిస్తే దీనిలోని ఎల్‌ఈడీ టైల్యాంప్‌లు కొద్దిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. దీనిలో న్యూ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ బంపర్‌లు, వెనుక భాగంలో మారిన్ని మార్పులను ఆశించవచ్చు. ఈ మార్పులు రాబోయే 7 -సీట్ల మోడల్‌ను సాధారణ క్రెటా నుండి వేరు చేయడానికి సహాయపడతాయి.
అల్కజార్ పేరుతో భారత మార్కెట్లోకి..
కాగా, ఆన్ లైన్లో లీకైన సమాచారం ప్రకారం రాబోయే హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. 1.5- లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వచ్చే మొదటి ఇంజన్ 115 పిఎస్,144 ఎన్ఎమ్ పీక్ పవర్, టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. ఇది 5- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటితో కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక రెండవ ఇంజన్ 1.5-లీటర్ టర్బో-డీజిల్ తో వస్తుంది. ఇది 115 పిఎస్, 250 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. ఇది 6 -స్పీడ్ మాన్యువల్ లేదా 6- స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటుంది. ఇక మూడో ఇంజన్ 1.4 -లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 140 పిఎస్, 242 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జతచేయబడుతుంది.
నూతనంగా విడుదలయ్యే 7 -సీటర్ హ్యుందాయ్ ఎస్‌యూవీ వేరియంట్ క్రెటా మాదిరిగానే పవర్‌ట్రైన్ ఆప్షన్ ని అందించే అవకాశం ఉంది. ఇక ఈ 7 సీటర్ వేరియంట్ ఫీచర్ల విషయానికొస్తే, దీనిలో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, ఎల్‌ఇడి హెడ్‌లైట్లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను అందిచనున్నారు. భారత మార్కెట్లో దీని ధర రూ. 15 లక్షలు నుండి రూ. 19 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్లో ఎంజి హెక్టర్ ప్లస్, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవి 500, టాటా గ్రావిటాస్ మోడళ్లకు గట్టి పోటీగా నిలువనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.