కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు వేగంగా పడిపోతున్నందున సీనియర్ సిటిజన్ల(senior citizens) ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక ఎఫ్డి పథకాలను పొడగించాయి ప్రముఖ బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్, ఐసిఐసిఐ(ICICI) బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) వంటి అగ్ర రుణదాతలు సీనియర్ సిటిజన్లకు వర్తించే ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) పై ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లపై అదనపు వడ్డీని అందిస్తున్నాయి. అయితే, వారి సంరక్షణ కోసం ఈ స్కీమ్‌లను మరి కొద్ది నెలల పాటు పొడిగించాలని నిర్ణయించాయి. కాగా, సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(fixed deposit) పథకాన్ని తొలుత సెప్టెంబర్ వరకే అందిచాలని భావించిన ఆయా బ్యాంకులు, తర్వాత వాటిని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించాయి. కాగా, ఎస్బిఐ బ్యాంకు మాత్రం దీనిని 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ ప్రత్యేక ఎఫ్డి పథకంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలిద్దాం.
హెచ్‌డిఎఫ్‌సి స్పెషల్ ఎఫ్డి స్కీమ్...
సీనియర్ సిటిజన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి(HDFC) బ్యాంక్ స్పెషల్ ఎఫ్డి పథకాన్ని అమలు చేస్తుంది. దీన్ని హెచ్‌డిఎఫ్‌సి సీనియర్ సిటిజన్ కేర్‌గా పిలుస్తారు. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు పెట్టే డిపాజిట్లపై 75 bps మేర అధిక వడ్డీ అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్డి(Senior Citizen Care FD) కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, 6.25% వడ్డీ రేటు లభిస్తుంది. కాగా, ఈ వడ్డీ రేట్లు నవంబర్ 13 నుండి వర్తిస్తాయి.
ఐసిఐసిఐ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డి స్కీమ్..
సీనియర్ సిటిజన్స్ కోసం ఐసిఐసిఐ(ICICI) బ్యాంక్ స్పెషల్ ఎఫ్డి పథకాన్ని అమలు చేస్తుంది. దీన్ని ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్‌గా పేర్కొంటారు. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు పెట్టే డిపాజిట్లపై 80 bps మేర అధిక వడ్డీ లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డి(Golden Years FD ) పథకం కింద సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 6.30% వడ్డీ రేటు లభిస్తుంది. కాగా, ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 21 నుండి వర్తిస్తాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషల్ ఎఫ్డి స్కీమ్..
సీనియర్ సిటిజన్లకు కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఎఫ్డి స్కీమ్‌ను అమలు చేస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda). దీనిలో సీనియర్ సిటిజన్లు పెట్టే ఫిక్స్డ్ డిపాజిట్లపై 100 bps మేర అధిక వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్డి స్కీమ్ (5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు) కింద ఫిక్స్డ్ డిపాజిట్(fixed deposit ) చేస్తే, సంవత్సరానికి 6.25% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ వడ్డీరేట్లు నవంబర్ 16 నుండి వర్తిస్తాయి.