బ్యాంకులు సాధారణ ప్రజలకంటే సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై (FD) ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. దీంతో సీనియర్ సిటిజన్లు (Senior Citizens) చాలా మంది బ్యాంకుల్లోనే తమ డబ్బును దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ముంబై బేస్డ్ బ్యాంకు అయిన ఆర్బీఎల్ వడ్డీ రేట్లను సవరించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో సర్దుబాట్లు చేసింది. ఇంతకు ముందు టెన్యూర్ ఆధారంగా కనిష్ఠంగా 3.75 శాతం నుంచి గరిష్ఠంగా 8.05 శాతం వరకు సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు (Interest Rates) ఉన్నాయి. ప్రస్తుత సవరణలతో గరిష్ఠ వడ్డీ రేటు 8.8 శాతానికి పెరిగింది.
నూతన వడ్డీ రేట్లు
RBL బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లు 453 రోజుల నుంచి 725 రోజులలోపు చేసిన రూ.2 కోట్ల లోపు మొత్తానికి 8.05 శాతం వడ్డీ లభిస్తుంది. అదే విధంగా 12 నెలల నుంచి 15 నెలలలోపు టెన్యూర్కి, 726 రోజుల నుంచి 60 నెలల వ్యవధికి 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. 60 నెలల 2 రోజుల నుంచి 240 నెలలలోపు ఎఫ్డీలపై 6.75 శాతం వడ్డీ అందుకోవచ్చు. 60 నెలల మెచ్యూరిటీ వ్యవధి గల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై 7.50 శాతం వడ్డీ అందుతుంది.
తక్కువ టెన్యూర్ ఉన్న ఎఫ్డీ రేట్లు
ఏడాదిలోపు కాల వ్యవధిలో RBL బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అందించే ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
* 241 రోజుల నుంచి 364 రోజుల వరకు 6.35% వడ్డీ అందుతుంది.
* 181 రోజుల నుంచి 240 రోజుల వరకు 5.50%.
* 91 రోజుల నుంచి 180 రోజుల వరకు 5%.
* 46 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో 4.50% .
* 15 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధిపై 4.25%.
* 7 రోజుల నుంచి 14 రోజుల వరకు 3.75% వడ్డీ లభిస్తుంది.
అదనంగా వడ్డీ ప్రయోజనం
ఆర్బీఎల్ బ్యాంక్ తన వెబ్సైట్లో సీనియర్ సిటిజన్లు సంవత్సరానికి 0.50 శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులని పేర్కొంది. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ) సంవత్సరానికి 0.75 శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులని తెలిపింది. అంటే సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా ఉన్న 8.05 శాతానికి మరో 0.75 శాతం కలిసి మొత్తం ఏడాదికి 8.8 శాతం వడ్డీ పొందవచ్చు. అయితే ఈ సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లు నాన్ రెసిడెంట్ ఫిక్స్డ్ డిపాజిట్లపై (NRE/NRO) వర్తించవు.
80సీ కింద ట్యాక్స్ సేవింగ్ కోసం చేసే రూ.1.5లక్షలలోపు ఎఫ్డీలను ముందుగా క్లోజ్ చెయ్యడం కుదరదు. ఐదేళ్లకు చేస్తే ఐదేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే దాన్ని క్లోజ్ చేసేందుకు వీలవుతుంది. అయితే ఎన్ఆర్ఈ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ నిబంధన వర్తించదు. మరోవైపు సీనియర్ సిటిజన్లు కాకుండా సాధారణ ప్రజలు RBL బ్యాంక్లో రూ.2 కోట్ల కంటే తక్కువ FDలపై 3.25 నుంచి 7.55% మధ్య వడ్డీ రేట్లు అందుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fixed deposits, Senior citizens