చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లకుంటే పేరెంట్స్ తిట్టేవారు. అవసరమైతే నాలుగు తగిలించేవారు. చదువుకోకుంటే గాడిదలు కాస్తావా..? అని కొట్టేవారు. కానీ ఓ యువకుడు నిజంగానే చదువు మానేసి..గాడిదలు కాస్తున్నాడు. ఉన్నత చదువులు చదువుకొని బాగా డబ్బు సంపాదిస్తున్న వారి కంటే ఎక్కువే.. ఆదాయం పొందుతున్నాడు. గాడిద పాలను అమ్ముతూ కోట్లు గడిస్తున్నాడు. అంతేకాదు కొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. తమిళనాడు (Tamilnadu)లోని తిరునల్వేలి జిల్లా వానార్‌పేటకు చెందిన యు.బాబు 11వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువుపై ఆసక్తి లేక ఆ తర్వాత మానేశాడు. అనంతరం కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. లాభసాటిగా లేకపోవడంతో గాడిదలు (Donkey Business) పెంచాలని నిర్ణయించుకున్నాడు.
గాడిదలు పెంచుతానంటే మొదట్లో అందరూ నవ్వారు. కానీ దాని పాల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో బాబు బాగా తెలుసు. బెంగళూరుకు చెందిన ఓ కాస్మొటిక్ కంపెనీ 28 రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తోంది. వాటి తయారీలో గాడిద పాలదే (Donkeys Milk) కీలక పాత్ర. నెలకు 1000 లీటర్ల పాలు అవసరమవుతాయి. కానీ అంత భారీ మొత్తంలో సరఫరా చేసే వారు చుట్టుపక్కల ఎక్కడా లేరు. తమిళనాడు (Tamilnadu) మొత్తం మీద 2 వేల గాడిదలే ఉన్నాయి. ఒక్కో ఆడ గాడిద ఆరు నెలల పాటు రోజుకు 350 ఎం.ఎల్. చొప్పున మాత్రమే పాలిస్తాయి. అందుకే కాస్మొటిక్ కంపెనీలకు సరిపడా గాడిద పాలు ఉత్పత్తి కావడం లేదు. ఈ డిమాండ్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు బాబు. కానీ ఆ ఐడియాను కుటుంబ సభ్యులకు చెబితే ఎవరూ వినలేదు. ఈ క్రమంలోనే వారిని విరుదాచలంలో గాడిద పాలు అమ్మే వారి వద్దకు తీసుకెళ్లాడు. వారు 10 మి.లీ. పాలను రూ.50 ఎలా అమ్ముతున్నారో వివరించారు. గాడిద పాలలో ఇంత లాభముందా? అని బాబు కుటుంబ సభ్యులు అప్పుడు నమ్మారు.
బాబుకు వ్యవసాయ భూమి (Agriculture) చాలానే ఉంది. అందులో కొంత భూమిని అమ్మి.. 100 గాడిదలను కొన్నాడు. వాటితో తమిళనాడులోనే మొట్ట మొదటి డాంకీ ఫామ్ (Donkey Farm)ని ఏర్పాటు చేశాడు. తన మిత్రుడి నుంచి 17 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అందులో గాడిదలను పెంచుతున్నాడు. పూవనూరులో గాడిదలను కాసే ఓ ఫ్యామీలిని పనికి పెట్టుకున్నాడు. గాడిదల బాగోగులను వారే చూసుకుంటారు. సాధారణంగా దేశీ గాడిద ధర రూ.40వేలు పలుకుతుంది. కానీ అవి రోజుకు 350 మి.లీ. పాలు మాత్రమే ఇస్తాయి. గుజరాత్ హలారీ జాతి గాడిద రేటు లక్ష వరకు ఉంటుంది. అవి రోజుకు లీటర్ చొప్పున పాలిస్తాయి. ఇప్పుడు బాబు వద్ద కొన్ని దేశీ గాడిదలు, మరికొన్ని గుజరాత్ హలారీ గాడిదలు ఉన్నాయి. గాడిదలకు బలవర్ధక ఆహారం అదించేందుకు.. అక్కడే 5 ఎకరాల్లో రాగులు, ఇతర తృణధాన్యాలను సాగు చేస్తున్నాడు. గాడిదలకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ..పాల ఉత్తత్తి చేస్తున్నాడు.
బెంగళూరులోని కాస్మొటిక్ కంపెనీతో బాబు ఒప్పందం కుదర్చున్నాడు. లీటర్‌కు 8 వేల చొప్పున పాలను విక్రయిస్తున్నాడు. మరి గాడిద పాలకు ఎందుకు ఇంత రేటు ఉందో తెలుసా..? శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు... వృద్ధాప్య ఛాయలను తగ్గించే సామర్థ్యం వీటికి ఉంది. పలు రకాల ఔషధాలతో పాటు సబ్బులు, క్రీములు వంటి బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో వినియోగిస్తున్నారు. గాడిద పాలతో తయారుచేసిన కాస్మొటిక్ ఉత్పత్తుల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే బాబు కూడా పెద్ద మొత్తంలో పాలను విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, Success story