news18-telugu
Updated: November 11, 2020, 1:56 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పెన్షనర్లకు అందిస్తున్న సేవలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగుపరుస్తోంది. పింఛనుదారులకు ప్రత్యేకంగా ఎస్బీఐ పెన్షన్ సేవ (SBI Pension Seva) వెబ్సైట్ను ఆ బ్యాంకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పెన్షన్ పొందడానికి పింఛనుదారుడు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఈ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమణ పత్రాన్ని ఎస్బీఐ ఖాతాదారులు బ్యాంక్ శాఖలలో లేదా ఆన్లైన్ ద్వారా డిసెంబర్ చివరి వరకు సమర్పించవచ్చు. అందుబాటులో ఉన్న నాలుగు మార్గాల్లో ఏదో ఒక విధంగా పింఛనుదారులు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఖాతాదారులు తమ సౌలభ్యాన్ని బట్టి మాన్యువల్ గా, ఎస్బీఐ బ్రాంచ్లో డిజిటల్ విధానంలో, ఉమాంగ్ యాప్లో ఆన్లైన్ ద్వారా, సిటిజన్ సర్వీస్ సెంటర్స్ (CSC) లేదా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల ద్వారా ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
వెబ్సైట్ ద్వారా సేవలుపింఛనుదారుల కోసం ఎస్బీఐ ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. ఇప్పుడు ఖాతాదారులు ప్రతి చిన్న అవసరానికీ బ్యాంకు బ్రాంచ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. పెన్షన్ సంబంధిత వివరాలను ఎస్బీఐ పెన్షన్ సేవ వెబ్సైట్లో క్షణాల్లోనే తనిఖీ చేయవచ్చు. ఎస్బీఐ పెన్షన్ సేవ వెబ్సైట్లో ఖాతాదారులు పెన్షన్ స్లిప్, ఫారం-16 లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ ప్రొఫైల్ వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెట్టుబడికి సంబంధించిన వివరాలు, లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్, లావాదేవీల వివరాలు.. వంటివి ఎప్పుడైనా క్షణాల్లోనే తనిఖీ చేసుకోవచ్చు.
పెన్షనర్లకు ప్రయోజనాలు
పెన్షనర్లకు ఎస్బీఐ మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఖాతాదారులు పెన్షన్ చెల్లింపు వివరాలను మొబైల్ ఫోన్లో SMS ద్వారా పొందవచ్చు. పెన్షన్ స్లిప్లను ఈ మెయిల్, పెన్షన్ చెల్లించే శాఖల ద్వారా పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లలో ఎక్కడైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సదుపాయాన్ని బ్యాంకు కల్పించింది. బ్యాంకు శాఖల్లో జీవన్ ప్రమన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)ను ఖాతాదారుల కోసం ప్రకటించింది. రక్షణ, రైల్వే, CPAO, రాజస్థాన్ పెన్షనర్లు EPPO ప్రొవిజన్కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
ఎలా నమోదు చేసుకోవాలి?
వినియోగదారులు ముందు యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత పెన్షన్ అకౌంట్ నంబరు, పుట్టిన తేదీ, పెన్సన్ చెల్లించే బ్రాంచ్ కోడ్ వివరాలను ఎంటర్ చేయాలి. గతంలో బ్యాంకు బ్రాంచులో ఇచ్చిన ఈ మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత కొత్త పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి. ఈ ఐడీ, పాస్వర్డులను ఎంటర్ చేసి ఎప్పుడైనా తమ పెన్షన్ అకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు పెన్షనర్లు జీవణ ప్రమాణ పత్రాన్ని సమర్పించేందుకు నవంబర్ 30ను గడువుగా నిర్ణయించారు. కానీ ఈ సంవత్సరం కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని పింఛనుదారులు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించడానికి గడువును పెంచారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 11, 2020, 1:56 PM IST