జీవిత బీమా పాలసీలను అందించే SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ప్రత్యేకమైన ‘న్యూ ఏజ్ సొల్యూషన్’ ప్రొడక్ట్‌ను ప్రవేశపెట్టింది. 'SBI లైఫ్ ఇ-షీల్డ్ నెక్స్ట్' పేరుతో ప్రారంభించిన ఈ పాలసీ.. కస్టమర్ల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు రక్షణ కవరేజీని 'లెవల్ అప్' చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. భవిష్యత్తులో పాలసీ కవరేజీని పెంచుతుంది. ఇది నాన్ ఇండివిడ్యువల్, నాన్- లింక్డ్, నాన్- పార్టిసిపేటింగ్ రిస్క్ ప్రీమియం ప్రొడక్ట్ అని కంపెనీ పేర్కొంది. ఈ పాలసీ స్టాక్ మార్కెట్‌తో లింక్ కాదు. దీంతో పాటు పాలసీదారులతో ఎలాంటి లాభం లేదా డివిడెండ్‌లను పంచుకోదు.
పాలసీ ఎలా పనిచేస్తుంది?
పాలసీ తీసుకున్న వారు భవిష్యత్తులో పెళ్లి, పిల్లలు, సొంత ఇల్లు.. వంటి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకుంటారు. ఆ సమయంలో వారి అవసరాలకు తగ్గట్లు బీమా కవరేజీని ప్రస్తుత పాలసీ పెంచుతుంది. బీమా మొత్తాన్ని పెంచడం ద్వారా వారి కుటుంబానికి SBI లైఫ్ ఇ-షీల్డ్ నెక్స్ట్ ప్రొడక్ట్ భరోసా కల్పిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది మొత్తం మూడు ప్లాన్ ఆప్షన్లను అందిస్తుంది.
లెవల్ కవర్, ఇంక్రీజింగ్ కవర్, లెవల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్.. వంటి మూడు ఆప్షన్లతో ఈ ప్రొడక్ట్‌ను ఎంచుకోవచ్చు. మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో ఈ మూడు ఆప్షన్లను ఎస్బీఐ లైఫ్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రారంభంలో ఒకసారి ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్‌ను.. పాలసీ అమల్లో ఉన్నంత కాలం మార్చుకోవడం సాధ్యం కాదు.
ఈ కొత్త ప్రొడక్ట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ రవి కృష్ణమూర్తి మాట్లాడారు. జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను చేరుకునే క్రమంలో.. పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉండాలని చెప్పారు. ఎస్బీఐ లైఫ్ ఇ-షీల్డ్ నెక్స్ట్, అందులోని మూడు ప్లాన్ ఆప్షన్లు వినియోగదారుల అవసరాలను తీర్చగలవని వివరించారు.
ఆప్షన్ 1: Level Cover Benefit
లెవల్ కవర్ బెనిఫిట్‌ను ఎంచుకున్న వారికి.. పాలసీ అమల్లో ఉన్నంత వరకు హామీ ఇచ్చిన మొత్తం స్థిరంగా ఉంటుంది.
ఆప్షన్ 2: Increasing Cover Benefit
ఇందులో పాలసీదారులు చనిపోతే ఇచ్చే హామీ మొత్తం.. బీమా చేసిన మొత్తంపై సంవత్సరానికి 10 శాతం చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు ప్రతి ఐదేళ్లకు ఒకసారి అమల్లోకి వస్తుంది. ఇలా బీమా చేసిన మొత్తంలో గరిష్టంగా 100 శాతం వరకు పెరుగుతుంది.
ఆప్షన్ 3: Level Cover with Future-Proofing Benefit
పాలసీదారుడు పెళ్లి చేసుకోవడం లేదా తల్లిదండ్రులు అవ్వడం లేదా ఇల్లు కొనడం వంటి ముఖ్యమైన మైలురాళ్లను అధిగమిస్తున్న సందర్భంలో.. అప్పటి అవసరాలకు తగ్గట్లు పాలసీ కవరేజీని ఈ ఆప్షన్ పెంచుతుంది.
ఈ సదుపాయం పాలసీ వ్యవధిలో ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత మాత్రమే ఇలాంటి బెనిఫిట్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వివిధ సందర్భాల్లో ఈ ఆప్షన్ల కింద అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా పాలసీదారుల విచక్షణకు సంబంధించిన అంశం. దీంతోపాటు ప్రీమియం చెల్లించేందుకు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Insurance