స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉన్నట్టైతే మీ కేవైసీ వివరాలు వెంటనే అప్డేట్ చేయాలి. లేకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. 2021 మే 31 లోగా కస్టమర్లు అందరూ కేవైసీ అప్డేట్ చేయాలని ఎస్బీఐ కోరుతోంది. ఇప్పటికే ట్విట్టర్, ఇమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం ఇస్తోంది. కేవైసీ వివరాలు అప్డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని, బ్యాంకింగ్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఎస్బీఐ చెబుతోంది. కాబట్టి ఎస్బీఐ కస్టమర్లు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్డేట్ చేయాల్సిందే. కస్టమర్లు తమ హోమ్ బ్రాంచ్‌లో మాత్రమే కాదు దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌లో కూడా కేవైసీ వివరాలు అప్డేట్ చేయొచ్చు. అంతేకాదు... ఇంటి నుంచి కూడా కేవైసీ అప్డేట్ చేయడం సాధ్యమే.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బ్యాంకుకు వెళ్లడం ఇష్టంలేని కస్టమర్లు పోస్ట్ లేదా ఇమెయిల్ ద్వారా తమ కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపొచ్చు. కస్టమర్లు సంబంధిత డాక్యుమెంట్స్‌ని బ్యాంకుకు పంపితే సరిపోతుంది. కేవైసీ అప్డేట్ అయిన తర్వాత కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. గతంలో బ్రాంచ్‌లో మాత్రమే కైవైసీ వివరాలు అప్డేట్ చేసే అవకాశం ఉండేది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పోస్ట్ లేదా ఇమెయిల్ ద్వారా కేవైసీ డాక్యుమెంట్స్ పంపొచ్చని ఎస్బీఐ ప్రకటించి కస్టమర్లకు ఊరటనిచ్చింది. అయితే కస్టమర్లు తమ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ నుంచే కేవైసీ డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది. కేవైసీ డాక్యుమెంట్స్ స్కాన్ తీసి మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ ఇమెయిల్ అడ్రస్‌కు పంపాలి.
— State Bank of India (@TheOfficialSBI) May 1, 2021
ఒకవేళ 10 ఏళ్ల లోపు పిల్లలకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే అకౌంట్ ఆపరేట్ చేస్తున్నవాళ్లు కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వేర్వేరుగా పంపాల్సి ఉంటుంది. ఐడీ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, ప్రభుత్వ లేదా డిఫెన్స్ ఐడీ కార్డ్, ప్రముఖ ఎంప్లాయర్స్ నుంచి ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్, పోస్ట్ ఆఫీసులు జారీ చేసిన ఫోటో ఐడీ కార్డ్, యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీలు విద్యార్థులకు జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డులు స్కాన్ చేసి పంపొచ్చు.
ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ (గత 3 నెలల్లోపుది), సాలరీ స్లిప్, ఇన్క్యామ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్, ఎలక్ట్రిసిటీ బిల్ (గత 6 నెలల్లోపుది), ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్ (గత 3 నెలల్లోపుది), బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ప్రముఖ ఎంప్లాయర్ నుంచి లెటర్, పబ్లిక్ అథార్టీ నుంచి లెటర్, రేషన్ కార్డ్, వోటర్ ఐడీ కార్డ్ (ప్రస్తుత అడ్రస్ ఉండాలి), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్, లీజ్ అగ్రిమెంట్, సేల్ డీడ్ లాంటి రిజిస్టర్డ్ కాపీస్, యూనివర్సిటీ, విద్యాసంస్థకు చెందిన రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, డీన్, హాస్టల్ వార్డెన్ జారీ చేసిన సర్టిఫికెట్, బంధువులతో ఉంటున్న విద్యార్థులైతే తమ బంధువులకు చెందిన అడ్రస్ ప్రూఫ్స్, సమీప బంధువుల అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్డౌన్, ఇతర ఆంక్షలు ఉండటంతో కేవైసీ వివరాలు అప్డేట్ చేయని కస్టమర్ల అకౌంట్లపై ఎలాంటి పరిమితులు పెట్టొద్దని, 2021 డిసెంబర్ 31 లోగా అప్డేట్ చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.